అధికారమే లక్ష్యం... బెంగాల్‌లా చేజారొద్దు

ప్రధానాంశాలు

అధికారమే లక్ష్యం... బెంగాల్‌లా చేజారొద్దు

రాజకీయవ్యూహం మేం చూసుకుంటాం
బూత్‌స్థాయిలో ఆధిపత్యం సాధించాలి
పదాధికారుల భేటీలో ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ విషయంలో జాతీయ నాయకత్వం ప్రత్యేకదృష్టితో ఉందని, 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్‌ సంతోష్‌ రాష్ట్ర పార్టీ నాయకులకు సూచించారు. రాజకీయవ్యూహాలు జాతీయ నాయకత్వం చూసుకుంటుందని, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని చెప్పారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం శ్యామాప్రసాద్‌ముఖర్జీ భవన్‌లో బండి సంజయ్‌ అధ్యక్షతన పదాధికారుల సమావేశం శనివారం జరిగింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఎల్‌ సంతోష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘పశ్చిమబెంగాల్‌లో అధికారం లక్ష్యంగా పార్టీ చాలా గట్టిగా ప్రయత్నించినా సంస్థాగత బలం లేక 74 సీట్లే గెలిచాం. తెలంగాణలో అనుకూల వాతావరణం ఉంది. అధికారమే లక్ష్యంగా పనిచేయండి’ అని సూచించారు. తెలంగాణపై అధిష్ఠానం సీరియస్‌గా ఉందని, ఆషామాషీగా ఉండొద్దని, ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని సూచించారు.

టీకా కేంద్రాలు, రేషన్‌ దుకాణాల వద్ద మోదీ ఫొటోలు
‘కరోనా టీకాల్ని కేంద్రమే ఉచితంగా ఇస్తోంది. బియ్యం ఖర్చు దాదాపు కేంద్రమే భరిస్తోంది.. టీకా కేంద్రాలు, రేషన్‌షాపుల వద్ద ప్రధాని మోదీ ఫొటోలు పెట్టండి’ అని సంతోష్‌ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ క్రియాశీలం అవుతోందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా 34 వేల పోలింగ్‌ బూత్‌లున్నాయి, 30 వేల బూత్‌లలో రాజకీయంగా భాజపా ఆధిపత్యం సాధించేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. అంతకుముందు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, మహిళా, యువ, కిసాన్‌ తదితర ఏడు మోర్చాల నేతలతో సంతోష్‌ సమావేశమయ్యారు. భాజపా బలోపేతానికి మోర్చాల ద్వారా కృషి చేయాలన్నారు.


సామాజిక మాధ్యమాల ద్వారా క్షేత్రస్థాయికి

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు సామాజిక మాధ్యమాలు విశేషంగా తోడ్పడతాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని మహిళా మోర్చా కార్యకర్తలు చురుకైన పాత్ర పోషించాలని భాజపా మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్‌ కోరారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భాజపా మహిళా మోర్చా సామాజిక మాధ్యమాలు, మీడియా ఇన్‌ఛార్జిల జాతీయ కార్యశాల నిర్వహించారు. ఇందులో వానతి శ్రీనివాసన్‌ మాట్లాడుతూ, యువ ఓటర్లు భారీగా పెరిగారని, భాజపా విధానాలు, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా వారి వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో తెలంగాణలో భాజపా జెండా ఎగురవేయనుందని చెప్పారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుష్యంత్‌కుమార్‌ గౌతం, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు కె.గీతామూర్తి, జాతీయ ప్రధాన కార్యదర్శి సుప్రీత్‌ కౌర్‌ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.


భాజపా ఎస్సీ మోర్చా కర్ణాటక ఇన్‌ఛార్జిగా ఎస్‌.కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి, తెలంగాణకు చెందిన ఎస్‌.కుమార్‌ ఎస్సీ మోర్చా కర్ణాటక వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు. అలాగే.. పుదుచ్చేరికి తెలంగాణకే చెందిన అశోక్‌, తెలంగాణకు జయకుమార్‌ కాంగే నియామకమయ్యారు. వీరితోపాటు మరికొందరిని ఆయా రాష్ట్రాల ఇన్‌ఛార్జులుగా ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్సింగ్‌ ఆర్య శనివారం నియమించారు. రాష్ట్రాల్లో భాజపా బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన ఎస్సీ మోర్చా ఇన్‌ఛార్జులకు సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని