రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పుట్టగతులుండవు

ప్రధానాంశాలు

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పుట్టగతులుండవు

రేవంత్‌రెడ్డి ఆ పార్టీని నిండా ముంచుతున్నారు
తెరాస నేతల ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను నిండా ముంచుతున్నారని, అర్థంపర్థంలేని మాటలతో ఆ పార్టీకి పుట్టగతులు, భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల శాసనసభాకమిటీ ఛైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్‌ గజ్వేల్‌లో నిర్వహించిన సభ తుస్సుమందని, కాంగ్రెస్‌కు ఆదరణ లేదని తేలిపోయిందన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. ‘‘రేవంత్‌ పేరుకే పీసీసీ అధ్యక్షుడు. చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటున్నారు. ఆయన నైజం ఏంటో సొంతపార్టీ ఎంపీ శశిథరూర్‌పై నోరు పారేసుకున్నప్పుడే కాంగ్రెస్‌ నేతలకూ అర్థమైంది. గజ్వేల్‌లో మునుపెన్నడూ లేని అభివృద్ధి కేసీఆర్‌ చలవే. రైలు కూడా వచ్చింది. అధికారం కోల్పోయిన అసహనంతో కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారు’’ అని అన్నారు. ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్‌ సభకు 2లక్షల మంది వచ్చినట్లు రేవంత్‌రెడ్డి కోతలు కోస్తున్నారు. నిజంగా అంత మంది వచ్చినట్లు నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా. రానట్లు తేలితే రేవంత్‌రెడ్డి పీసీసీ పదవికి రాజీనామా చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని