మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధికి యత్నం

ప్రధానాంశాలు

మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధికి యత్నం

భాజపాపై రేవంత్‌రెడ్డి ధ్వజం
తెలంగాణ కమలదళం రిమోట్‌ కేసీఆర్‌ చేతిలో ఉందని ఆరోపణ
మంత్రి కేటీఆర్‌కు ‘వైట్‌ ఛాలెంజ్‌’ సవాల్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: సెప్టెంబరు 17ను అడ్డంపెట్టుకుని రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు భాజపా యత్నిస్తోందని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భాజపా రిమోట్‌ కేసీఆర్‌ చేతిలో ఉందని..ఆయన చెప్పినట్లే రాష్ట్రంలో ఆ పార్టీ నడుస్తోందని విమర్శించారు. శనివారం రేవంత్‌రెడ్డి గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబరు 9న తెలంగాణ ప్రకటన చేశారు. మరి ప్రధాని నరేంద్రమోదీ పుట్టిన రోజునాడు తెలంగాణకు వచ్చిన అమిత్‌షా రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చారు. 160 ఏళ్లనాటి ఘటనను 70 సంవత్సరాల కిందట జరిగినట్లు చరిత్రను వక్రీకరించారు. రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆధారాలతో అమిత్‌షాకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేద్దామని అపాయింట్‌మెంట్‌ కోరితే సమయం ఇవ్వలేదు’అని రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ కుటుంబ అవినీతిపై మాట్లాడే సంజయ్‌, అర్వింద్‌లు అమిత్‌షాకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు.ఇంద్రవెల్లి, రావిర్యాల, మూడుచింతలపల్లి, గజ్వేెల్‌లో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా సభలను విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

నిరుద్యోగ సమస్యలపై పోరాటం

నిరుద్యోగ సమస్యలపై అక్టోబరు 2 గాంధీ జయంతి నుంచి డిసెంబరు 9 సోనియాగాంధీ జన్మదినం వరకు పోరాటం చేయనున్నట్లు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం గాంధీభవన్‌లో పీసీసీ కార్యవర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. ‘‘కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 22న ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తాం. భారత్‌బంద్‌లో భాగంగా ఈ నెల 27న హైదరాబాద్‌లో బంద్‌ జరుపుతాం’’ అని మల్లు రవి వివరించారు. 

ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృత ప్రచారం: షబ్బీర్‌అలీ

తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) కన్వీనర్‌ షబ్బీర్‌అలీ అన్నారు. పీఏసీ కన్వీనర్‌గా నియమితులైన సందర్భంగా పీసీసీ మైనార్టీ నాయకులు శనివారం హైదరాబాద్‌లో సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

కేటీఆర్‌ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి

సినీనటులు, ప్రముఖుల మాదకద్రవ్యాల కేసులో ఆరోపణలొస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎంపీ సంతోష్‌ ‘గ్రీన్‌ ఛాలెంజ్‌’ మాదిరిగా నేను కేటీఆర్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలకు ‘వైట్‌ ఛాలెంజ్‌’ విసురుతున్నా. ‘ఈ నెల 20న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్తూపం వద్దకు వస్తా. అక్కడికి మీరూ రండి. ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వద్దకు లేదా మరేదైనా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వద్దకు వెళ్దాం. నా రక్త నమూనాలు, వెంట్రుకలు ఇస్తా. పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత మీరూ, విశ్వేశ్వర్‌రెడ్డి ఇద్దరూ రక్త నమూనాలు, వెంట్రుకలు ఇవ్వండి. ఆ తర్వాత మీరూ మరో ఇద్దరికి వైట్‌ ఛాలెంజ్‌ విసరండి. దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోదాం’ అని రేవంత్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఆబ్కారీశాఖ విచారణలో నటులు రానా, రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేర్లు లేవు. కానీ ఈడీ విచారణలోకి వచ్చాయి. అప్పుడు వారిని తప్పించింది ఎవరు?’ అని రేవంత్‌ ప్రశ్నించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని