చెరకు రైతుల సమస్యలపై పోరాడతాం

ప్రధానాంశాలు

చెరకు రైతుల సమస్యలపై పోరాడతాం

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

జహీరాబాద్‌, న్యూస్‌టుడే : ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జహీరాబాద్‌ ప్రాంత చెరకు రైతులు నేడు రోడ్డు మీదికి రావాల్సి వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సర్కారు వెంటనే కళ్లు తెరవకుంటే రైతులకు మద్దతుగా అసెంబ్లీలో పోరాటం చేస్తామన్నారు. శుక్రవారం జహీరాబాద్‌ వచ్చిన ఆయన చెరకు రైతుల ఇబ్బందులను తెలుసుకొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వమే నాలుగైదు చోట్ల కొనుగోలు కేంద్రాలను నెలకొల్పి.. ఈ ప్రాంతంలోని చెరకును సేకరించి కర్మాగారాలకు తరలిస్తే రైతుల ఇబ్బందులు తీరుతాయన్నారు.  ఒకసారి మొక్కజొన్న వద్దని, మరోసారి వరి వద్దని... చివరకు చెరకు వేయవద్దని చెప్పి రైతుల భూములతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని సీఎం చూస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ నేతలు భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి, సీతక్క ద్వారా అసెంబ్లీలో పోరాటం చేస్తామన్నారు. ఆయన వెంట గీతారెడ్డి ఉన్నారు.

రైతు ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన యువ రైతు రాజేష్‌ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని రేవంత్‌  ట్విటర్‌లో స్పందించారు.


12 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పలు సమస్యలపై శాసనసభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కాంగ్రెస్‌ శాసనసభా పక్షం నిర్ణయించింది. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అధ్యక్షతన శుక్రవారం ఆయన ఛాంబర్‌లో సమావేశం జరిగింది. సభలో లేవనెత్తాల్సిన ప్రధాన సమస్యలపై చర్చించారు. నిరుద్యోగ యువత- సంబంధిత సమస్యలు, దళిత బంధు పథకం, కృష్ణ, గోదావరి జలాల సమస్యలు, పోడు వ్యవసాయం, అటవీ హక్కుల చట్టం, ధరణి పోర్టల్‌.. మొత్తం 12 అంశాలపై తీర్మానం చేశారు. సభలో అన్ని అంశాలు చర్చకు వచ్చేలా చూడాలని కోరుతూ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి లేఖ రాశారు. ఎంపీ ఉత్తమ్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క ఈ సమావేశానికి హాజరయ్యారు.

రేవంత్‌రెడ్డి తీరుపై జగ్గారెడ్డి అసంతృప్తి

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తీరుపై వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జహీరాబాద్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ విషయంలో తనకు సమాచారం ఇవ్వరా అని ప్రశ్నించారు. ఆయన శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడారు. ‘‘నాతో వివాదం ఉందని రేవంత్‌రెడ్డి చెప్పాలనుకుంటున్నారా? పార్టీలో చర్చ లేకుండానే రెండు నెలల కార్యాచరణ ఎలా ప్రకటిస్తారు? ఇది కాంగ్రెస్‌ పార్టీనా లేక ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీనా’’ అని నిలదీశారు. గజ్వేల్‌ సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని..పార్టీకి ఎంత విధేయుడిగా ఉన్నా అవమానాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని