ఏడున్నరేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా?

ప్రధానాంశాలు

ఏడున్నరేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా?

సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ సవాల్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తెరాస ప్రభుత్వ ఏడున్నరేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? అని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. తెరాస రూ.425 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘తెరాస 20 ఏళ్లు పూర్తి చేసుకుందని, జలదృశ్యం నుంచి జన దృశ్యం అని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకొంటున్నారు. కానీ 2001లో తెరాస కార్యాలయానికి జలదృశ్యంలో భవనాన్ని ఇచ్చిన కొండా లక్ష్మణ్‌ బాపూజీని మరిచిపోయారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1,569 మంది త్యాగాలను ప్లీనరీలో స్మరించుకోలేదు. వారి కుటుంబాలకు రూ.పది లక్షలు, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఇప్పటివరకు 517 కుటుంబాలనే గుర్తించి రూ.పది లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన వారిని మరిచిపోయారు. ఇది అన్యాయం కాదా? నాడు తెలుగుతల్లి ఎవరితల్లి, మనది తెలంగాణ తల్లి అన్న కేసీఆర్‌.. నేడు ప్లీనరీలో తెలంగాణ తల్లిని మరిచిపోయారు. లక్షా 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయక, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.4 వేల కోట్లు విడుదల చేయక దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగులు అభద్రతా భావంతో ఉన్నారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అప్పుల పాలై ఏడున్నరేళ్లలో 7,409 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు తెరాస పార్టీ కార్యాలయాలకు స్థలాల పేరిట రూ.వెయ్యి కోట్ల విలువైన ఆస్తులను కేసీఆర్‌ పోగేసుకున్నారు. నిజాం నవాబులను తలదన్నేలా సీఎం వారసులు ఆస్తులు సంపాదించారు. వీటన్నింటిపై చర్చకు సిద్ధంగా ఉన్నారా?’’ అని రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రికి సవాల్‌ చేశారు. పార్టీ అధ్యక్షుడు లేనప్పుడు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు ఆ అధికారాలు కట్టబెడుతూ తెరాస బైలాస్‌లో మార్పులు చేయడం భవిష్యత్‌ ముఖచిత్రాన్ని తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు.

దేవులపల్లి ప్రభాకర్‌రావు ఏమయ్యారు?

ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఎక్కడున్నారో ప్రభుత్వం చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ‘భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ప్రభాకర్‌రావును ముందుపెట్టి పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.35 వేల కోట్ల రుణం తీసుకుంది. దానికి ప్రతి నెలా వడ్డీ, ఉద్యోగుల జీతభత్యాలకు కలిపి నెలకు రూ.1200 కోట్లు ప్రభుత్వం ఇస్తేనే విద్యుత్‌ శాఖ నడుస్తుందని ప్రభాకర్‌రావు నివేదిక ఇచ్చారు. దాన్ని కేసీఆర్‌ చెత్తబుట్టలో వేయడంతో ప్రభాకర్‌రావు అడ్రస్‌ లేకుండాపోయారు. ఆయన స్థానంలో సింగరేణి సీఎండీకి బాధ్యతలు అప్పగించారు. మాకున్న సమాచారం మేరకు ప్రభుత్వమే ఏదో కుట్ర చేస్తోంది’ అని రేవంత్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

‘విజయగర్జన’కు మించిన సభ నిర్వహిస్తాం

డిసెంబరు 9న హైదరాబాద్‌లో ‘విద్యార్థి నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’ మోగిస్తామని, ప్రభుత్వంపై ధర్మయుద్ధం ప్రకటిస్తామని రేవంత్‌ చెప్పారు. వరంగల్‌లో తెరాస నవంబరు 15న నిర్వహించనున్న ‘విజయగర్జన’కు మించిన సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని