కేంద్ర మంత్రి హోదాలో ఉండీ పచ్చిఅబద్ధాలు

ప్రధానాంశాలు

కేంద్ర మంత్రి హోదాలో ఉండీ పచ్చిఅబద్ధాలు

కిషన్‌రెడ్డిపై మంత్రి హరీశ్‌రావు విమర్శ
క్రూడాయిల్‌ పేరు చెప్పి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతారా?
తన వల్లేే విజయశాంతి ఎంపీ అయ్యారని వెల్లడి

మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు, పక్కన తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: బాధ్యతాయుతమైన కేంద్రమంత్రి హోదాలో ఉండి కిషన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. క్రూడాయిల్‌ ధరలు పెరగడం వల్లే పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నామని ఆయన అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో భాజపా అభ్యర్థిని గెలిపిస్తే ఇంధన ధరల్ని తగ్గిస్తామని చెప్పాల్సింది పోయి అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం చల్లూర్‌లో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌తో కలిసి సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఒకే నెలలో 18 సార్లు ఇంధన ధరలను పెంచిన ఘనత కేంద్రానిదని హరీశ్‌ ఆక్షేపించారు.

ఏడేళ్లలో కేంద్ర పన్నులు రూ.4 నుంచి రూ.32లకు పెంచింది వారేనని... హుజూరాబాద్‌కు వస్తున్న కేంద్రమంత్రి సహా భాజపా నాయకులు అన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఈటల రాజేందర్‌ పూటకో మాట మాట్లాడుతున్నారని చెప్పారు. తన వల్లే సినీనటి విజయశాంతి మెదక్‌లో ఎంపీగా గెలిచారని హరీశ్‌రావు అన్నారు. ఆమె ఇక్కడికి ప్రచారానికి వచ్చి హరీశ్‌రావుకు ఈ నియోజకవర్గంలో ఏంపని అని అడుగుతున్నారని..మరి కిషన్‌రెడ్డి వారం రోజులుగా ఇదే నియోజకవర్గంలో తిరుగుతున్నారని.. ఆయనకు ఇక్కడ ఏంపని ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చి ఇక్కడి అభివృద్ధిపై తాము హామీ ఇస్తున్నామని...అదే భాజపా నేతలు మాత్రం ఏ ఒక్క హామీని నియోజకవర్గ ప్రజలకు ఇవ్వడంలేదని విమర్శించారు.

ఈటల రాజేందర్‌ గెలిస్తే దిల్లీ వాళ్లతో మాట్లాడి పనిచేస్తానంటార[ని..అదే తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ గెలిస్తే తామంతా గల్లీల్లో ఉండి పనులు చేస్తామని హరీశ్‌రావు చెప్పారు. భాజపా అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో వరిని అక్కడి ప్రభుత్వం కొనకుంటే రైతులు పంటను రోడ్లపై తగలబెట్టుకుంటున్నారని.. అదే తెలంగాణలో తాము ధాన్యాన్ని ఠంచనుగా కొంటున్నామన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని