తెరాస, కాంగ్రెస్‌లవి రహస్య ఒప్పందాలు

ప్రధానాంశాలు

తెరాస, కాంగ్రెస్‌లవి రహస్య ఒప్పందాలు

భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జి   తరుణ్‌ ఛుగ్‌ 

హుజూరాబాద్‌లో పార్టీ   మేనిఫెస్టో విడుదల

హుజూరాబాద్‌లో మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌, పక్కన రాష్ట్ర

అధ్యక్షుడు బండి సంజయ్‌, సీహెచ్‌.విద్యాసాగర్‌రావు తదితరులు

ఈనాడు డిజిటల్‌-కరీంనగర్‌, న్యూస్‌టుడే-జమ్మికుంట గ్రామీణం, కమలాపూర్‌: తెరాస, కాంగ్రెస్‌లవి రహస్య ఒప్పందాలని భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌ ఆరోపించారు. మంగళవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ‘భాజపా మేనిఫెస్టో’ను ఆయన విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన పుర ప్రముఖుల సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్‌ హయాంలో తెలంగాణలో రజాకార్ల పాలన నడుస్తోందన్నారు. ఆయన నిరంకుశత్వాన్ని తాళలేకనే పార్టీ నుంచి ఈటల బయటకు వచ్చారని ఛుగ్‌ చెప్పారు. రాజేందర్‌ గెలుపుతో కేసీఆర్‌లో అహంకారం తగ్గుతుందన్నారు. భాజపా గెలిచిన తరువాత హుజూరాబాద్‌కు కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధుల్ని అందిస్తామని తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్‌ పాలనను అంతం చేసేందుకు మరో ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరమొచ్చిందని, ఆ దిశగా భాజపా అడుగులు వేస్తుందన్నారు. మేధావి వర్గంతోపాటు విద్యార్థులు, ఉద్యోగులు సహకరించాలని ఆయన కోరారు. పార్టీ నేత, మాజీ గవర్నర్‌ సీహెచ్‌.విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో భాజపా గెలుపుతో రాష్ట్ర రాజకీయాలు మారుతాయని.. త్వరలోనే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పట్టణంతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కైనా, తనకైనా, సామాన్య కార్యకర్తకైనా ఎన్నికల కమిషన్‌ నిబంధలు(ఈసీ) ఒకేవిధంగా ఉంటాయని ఆయన అన్నారు. ఎన్నికల సభలు పెట్టుకోకుండా చేశారని కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ‘అసెంబ్లీలో మీ గుండె చప్పుడు వినిపించేవారు కావాలా.. కేసీఆర్‌ కుటుంబానికి జీ హుజూర్‌ అనే వ్యక్తి కావాలా నిర్ణయించుకోవాలి’ అని ఓటర్లను ఆయన కోరారు. అభ్యర్థి ఈటల రాజేందర్‌ కమలాపూర్‌, గూడూరు దళిత కాలనీల్లో ఇంటింటా ప్రచారం చేశారు. హుజూరాబాద్‌లో ప్రలోభాలు, కుట్రలు, కుతంత్రాలు, నోట్ల కట్టల పంపిణీ కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు, గౌరవ వేతనంతో పనిచేసే వారికి సైతం తెరాస హుకుం జారీ చేస్తోందన్నారు. కుటుంబం అంతా ప్రచారం చేయాలని, పార్టీకి ఓటు వేయకపోతే ఉద్యోగం తీసేస్తామని బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని