ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఎక్కడ?

ప్రధానాంశాలు

ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఎక్కడ?

తిమ్మాపూర్‌లో షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష

దీక్షలో వృద్ధురాలితో మాట్లాడుతున్న షర్మిల

కందుకూరు, న్యూస్‌టుడే: ఇంటికో ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన కేసీఆర్‌ మాటలు నమ్మి అధికారం కట్టబెడితే.. ఏడేళ్ల పాలనలో నాలుగింతలుగా నిరుద్యోగులను పెంచి ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులకు ఆత్మహత్యలా.. కేసీఆర్‌ ఇంట్లోనే కొలువులా.. అని విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని.. లేదంటే రాజీనామా చేయాలని అంటూ కేసీఆర్‌ని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఏడో రోజు మంగళవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని తిమ్మాపూర్‌కు చేరింది. ముందస్తు ప్రణాళికలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వగ్రామం తిమ్మాపూర్‌లో ఏర్పాటు చేసిన నిరుద్యోగ నిరాహార దీక్షాస్థలి వద్దకు చేరుకున్న ఆమె వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వృద్ధులు, మహిళలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. దీక్ష విరమించాక షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3.85 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. 14 వేల టీచరు ఉద్యోగాలు తొలగించడంతో పాటు 3500 బడులను మూసేసి విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. మాట తప్పిన కేసీఆర్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. దీక్ష అనంతరం తిమ్మాపూర్‌లో బస చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని