RS Praveen kumar: బహుజన్‌ సమాజ్‌ పార్టీలోకి ప్రవీణ్‌కుమార్‌!

ప్రధానాంశాలు

RS Praveen kumar: బహుజన్‌ సమాజ్‌ పార్టీలోకి ప్రవీణ్‌కుమార్‌!

నల్గొండలో ఆగస్టు 8న చేరిక

ఈనాడు, హైదరాబాద్‌: స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ బహుజన్‌ సమాజ్‌పార్టీ (బీఎస్పీ)లో చేరనున్నారు. వచ్చే నెల 8న నల్గొండలోని ఎన్‌జీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో, బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త రాంజీ గౌతం సమక్షంలో ఆయన పార్టీలో చేరతారు. కార్యక్రమానికి గురుకులాల మాజీ విద్యార్థులు (స్వేరోస్‌), మద్దతుదారులు, అభిమానులు హాజరుకానున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ అనంతరం ఆయన స్వేరోస్‌తో పాటు ఇతర ప్రతినిధులతో సమావేశమయ్యారు. పలు జిల్లాల్లో పర్యటించారు. అభిమానుల అభిప్రాయాల మేరకు ఆయన బీఎస్పీవైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఎస్పీ నేతలతోనూ ఆయన మాట్లాడినట్లు సమాచారం. తన నిర్ణయాన్ని అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు. ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీలో చేరిక కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద వర్గాల ప్రజలు తరలిరావాలని స్వేరోస్‌ ఇంటర్నేషనల్‌ ప్రతినిధి బిట్ల భాస్కర్‌ కోరారు.

తెరాస పాలనలో బహుజనులకు అన్యాయం
సూర్యాపేట (బాలాజీనగర్‌), న్యూస్‌టుడే: తెరాస పాలనలో బహుజనులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికే తాను విధుల నుంచి తప్పుకొన్నట్లు మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. బహుజన రాజ్యం ఒక్క తనతోనే సాధ్యపడదని, అందుకు అందరూ కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. పోరాటాల గడ్డగా పేరొందిన నల్గొండ జిల్లా వేదికగానే రాజకీయ భవిష్యత్తును ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. సూర్యాపేటలో మంగళవారం రాత్రి జరిగిన బహుజన ఉద్యోగ, ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తనకు ఆస్తులు, ఫాంహౌస్‌లు లేవని, ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడలేదంటూ.. బహుజనుల రాజ్యాధికారం స్థాపనకు ఆర్థికంగా సహకారం అందించాలని కోరారు. తెలంగాణ బహుజన అమరవీరుల త్యాగాలపై కొంతమంది భోగాలు అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏడేళ్ల పాలనలో అంబేడ్కర్‌ విగ్రహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూలమాల వేయడం సంతోషకరమన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని