ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
close

ప్రధానాంశాలు

ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలంటూ  కరీంనగర్‌ ప్రిన్సిపల్‌ మున్సిఫ్‌ జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ సాయి సుధ బుధవారం మూడో పట్టణ పోలీసు ఎస్‌హెచ్‌ఓకు ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకాపూర్‌ (ధూళికట్ట) గ్రామంలో స్వేరోస్‌ దీక్షా కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార్‌, ఉపాధ్యాయుడు న్యాతరి శంకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వేరోస్‌ సభ్యులంతా ఓ ప్రతిజ్ఞ చేశారు. అందులో హిందూ దేవుళ్లను పూజించబోమని, పిండప్రదానాలు చేయబోమని పేర్కొన్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. దీంతో ఇది హిందూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉందంటూ న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి 16 మార్చి 2021లో స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోకపోవడంతో మార్చి 18న కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మార్చి 22న ప్రిన్సిపల్‌ మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో న్యాయవాది ఎన్నంపల్లి గంగాధర్‌ ద్వారా పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు ఆధారాలు, పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి సాయి సుధ.. ప్రవీణ్‌కుమార్‌, న్యాతరి శంకర్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

నేను హిందూ వ్యతిరేకిని కాదు: ప్రవీణ్‌కుమార్‌

ముషీరాబాద్‌, న్యూస్‌టుడే: తాను హిందూ వ్యతిరేకిని కాదని, అలా ముద్ర వేయడం సరికాదని మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే తాను సర్వీసును వదులుకున్నానని పేర్కొన్నారు. బక్రీద్‌ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌ భోలక్‌పూర్‌లోని బడీమసీదు వద్ద ఆయన ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను ఒక వర్గానికే మేలు చేస్తున్నానని ప్రచారం చేయడం కుట్రేనన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని