వాగు గండం.. ఒడ్డునే ప్రసవం
close

ప్రధానాంశాలు

వాగు గండం.. ఒడ్డునే ప్రసవం

నిండు గర్భిణికి నరక యాతన

కడెం, న్యూస్‌టుడే: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటలేక ఓ నిండు గర్భిణి నరకం చూసింది. నాలుగు గంటల పాటు ప్రసవ వేదన అనుభవించింది. చివరికి ట్రాలీలో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన బుధవారం నిర్మల్‌ జిల్లా కడెం మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. బుధవారం తెల్లవారుజామున కడెం మండలం గంగాపూర్‌ పంచాయతీలోని దత్తోజిపేటకు చెందిన రొడ్డ ఎల్లవ్వకు పురిటినొప్పులు మొదలయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళదామని కుటుంబసభ్యులు ట్రాలీ జీపును మాట్లాడుకున్నారు. మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో గంగాపూర్‌ సమీపంలోని వాగు పొంగిపొర్లింది. ఇంటి నుంచి బయల్దేరిన వారు వాగు దాటే పరిస్థితి లేకపోవడంతో వాహనాన్ని ఒడ్డున ఆపారు. వరద ఉద్ధృతి తగ్గుతుందని అక్కడే నిరీక్షించారు. నాలుగు గంటల పాటు ఆ తల్లి కష్టాలు చూసి బంధువులు ఆందోళన చెందారు. చివరికి నొప్పులు ఎక్కువకావడంతో ట్రాలీలోనే ఎల్లవ్వ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికి వాగు ఉద్ధృతి కాస్త తగ్గడంతో గ్రామస్థులు జీపును ట్రాక్టర్‌కు కట్టి వాగు దాటించారు. తల్లీబిడ్డలను కడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక వైద్యం అందించారు. తక్కువ బరువుతో పుట్టిన బిడ్డకు మెరుగైన చికిత్స అందించేందుకు నిర్మల్‌ ఆసుపత్రికి తరలించారు. కడెం నదిపై రూ.10 కోట్లతో నిర్మిస్తున్న వంతెన నిర్మాణం రెండేళ్లుగా నత్తనడకన సాగుతోంది. ఆ పనులు వేగంగా పూర్తయితే మూడు గ్రామాల ప్రజలకు వాగుల గండం తప్పనుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని