త్వరలోనే కొత్త పింఛన్లు: మంత్రి కేటీఆర్‌

ప్రధానాంశాలు

త్వరలోనే కొత్త పింఛన్లు: మంత్రి కేటీఆర్‌

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌తో కలిసి ఆయన రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. తొలుత జిల్లా ఆసుపత్రిలో రూ.2.15 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌ గదిని సీనియర్‌ స్టాఫ్‌ నర్సులు ఝాన్సీ, వసంతల చేతులమీదుగా మంత్రి ప్రారంభింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొంచెం ఆలస్యమైనా అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కార్డులను అందజేస్తామని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం కొత్త పింఛన్ల పంపిణీ చేపడుతుందని పేర్కొన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో మరికొన్ని జిల్లా ఆసుపత్రుల్లో సీటీ స్కాన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సకు వచ్చే పేదలకు మెరుగైన, పారదర్శకమైన వైద్యసేవలు అందించేందుకు ఆధునిక వసతులు సమకూర్చామన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా ఉన్నతాధికారులు, సిరిసిల్ల పురపాలక సంఘం కౌన్సిలర్లతో కేటీఆర్‌ వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్‌ ఛైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని