గిరిజన గూడేలు, దళితవాడల్లో మౌలిక సదుపాయాలు

ప్రధానాంశాలు

గిరిజన గూడేలు, దళితవాడల్లో మౌలిక సదుపాయాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గిరిజన గూడేలు, దళితవాడల్లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలను గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, వీధి దీపాలు, విద్యుత్తు లైన్లు, ఇళ్ల మీదుగా వెళ్తున్న తీగలను తొలగించి సరిదిద్దడం, మంచినీటి కనెక్షన్లు తదితర సదుపాయాలను గుర్తించి.. అంచనాలు సిద్ధం చేయాలని సూచించింది. ఈ ప్రక్రియ పది రోజుల్లో పూర్తిచేయాలని పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ అధికారులకు స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళితవాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి.. చేపట్టాల్సిన పనులపై నివేదికలు రూపొందించారు. పనులు వెంటనే ప్రారంభించేందుకు అంచనాలు సిద్ధమవుతున్నాయి. మిగతా నియోజకవర్గాల్లోని గిరిజన, దళితవాడల్లోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, తాగునీటి కనెక్షన్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులు కోరిన మీదట సీఎం స్పందించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని