మూడు వారాల్లో బీసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి

ప్రధానాంశాలు

మూడు వారాల్లో బీసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీసీ కమిషన్‌ను మూడు వారాల్లో నియమించి నోటిఫికేషన్‌ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్‌లతోపాటు, కమిషన్‌ను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు ఎస్‌.గణేశ్‌రావు తదితరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ కమిషన్‌ ఏర్పాటుకు మరో నెల రోజులు గడువు కావాలని కోరారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజ్యాంగంలోని అధికరణ 243 ప్రకారం బీసీ కమిషన్‌ను మూడు వారాల్లో నియమించి నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 25కు వాయిదా వేసింది.

అప్పీలెట్‌ అథారిటీ ఏర్పాటు

కాలుష్య నియంత్రణ మండలిలో అప్పీలెట్‌ అథారిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.ప్రకాశ్‌రావు ఛైర్మన్‌గా మరో ఇద్దరు సభ్యులతో అథారిటీని ఏర్పాటు చేశామని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు. పీసీబీ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్‌లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. అప్పీలెట్‌ అథారిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పడంతో ఈ పిటిషన్‌లపై విచారణను కోర్టు మూసివేసింది. నీటి, వాయు కాలుష్యం పిటిషన్‌లపై విచారించే పరిధి అప్పీలెట్‌ అథారిటీకి లేనందున ఆ పిటిషన్‌లపై విచారణను వాయిదా వేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని