హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌పై కేసు కొట్టివేత

ప్రధానాంశాలు

హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌పై కేసు కొట్టివేత

దావా వేసిన న్యాయవాదికి సుప్రీంకోర్టు రూ.5 లక్షల జరిమానా

దిల్లీ: తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఎ.వెంకటేశ్వర రెడ్డిని అదే హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న ప్రతిపాదనను సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయస్థానం కార్యకలాపాలకు భంగం కలిగిస్తున్నారన్న కారణంపై ఫిర్యాదిదారుకు రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. కేసు పూర్వపరాలను పరిశీలిస్తే...తెలంగాణకు చెందిన ఆరుగురు న్యాయాధికారులను న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని ఆగస్టు 17న సమావేశమైన ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించింది. ఇందులో వెంకటేశ్వర రెడ్డి పేరు కూడా ఉంది. ఆయన పేరుకు అభ్యంతరం తెలుపుతూ బి.శైలేష్‌ సక్సేనా అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదును పరిశీలించేలా కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలు, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ (నిఘా, పరిపాలన)లను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దావా వేశారు. ఆయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనపై పలు ఆరోపణలు చేస్తూ పదోన్నతి కల్పించకూడదని విజ్ఞప్తి చేశారు. వెంకటేశ్వరరెడ్డి తెలుగు దేశం ఎంపీ కుటుంబానికి న్యాయ సలహాదారుగా పనిచేశారని ఆరోపించారు. 2017 జులై 31న తనపై కేసు పెట్టించారని తెలిపారు. వేధించడానికే ఇలా చేశారని ఆరోపించారు. ధర్మాసనం స్పందిస్తూ ‘‘తనపై ఉన్న పలు క్రిమినల్‌ కేసుల నుంచి తప్పించుకోవడానికే సక్సేనా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఎ.వెంకటేశ్వర రెడ్డిపై ఈ ఆరోపణలు చేశారు. ఆయన పదోన్నతిని అడ్డుకునే ప్రయత్నమిది. వెంకటేశ్వరరెడ్డి హైకోర్టు జడ్జి ఇచ్చిన ఆదేశాలనే అమలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి అందరికీ తెలిసిన సుస్థిర ప్రక్రియ ఉంది’’ అని పేర్కొంది.

బార్‌ కౌన్సిల్‌ పరిశీలించాలి

వెంకటేశ్వర రెడ్డిని వేధించడానికే సక్సేనా ఈ పిటిషన్‌ వేసినట్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘జరిమానా విధించడమే ఈ సమస్యకు పరిష్కారం. న్యాయవాది సక్సేనా వేసిన దావాను తిరస్కరిస్తున్నాం. నాలుగు వారాల్లో సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ సంక్షేమ నిధికి రూ. 5 లక్షలు చెల్లించాలి. ఆయన ప్రవర్తనను తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ పరిశీలించాలని భావిస్తున్నాం. ఇందుకోసం ఆదేశాల ప్రతిని ఆ సంస్థకు పంపిస్తున్నాం’’ అని తెలిపింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని