పంట నష్టం జరగలేదా?: హైకోర్టు

ప్రధానాంశాలు

పంట నష్టం జరగలేదా?: హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: గత అక్టోబరు, నవంబరులలో కురిసిన వర్షాలకు పంట నష్టం జరగలేదని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వినిపించిన వాదనలపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నాటి వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రైతులను ఆదుకునేలా ఆదేశించాలంటూ వి.కిరణ్‌కుమార్‌ మరో ఇద్దరు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.  వరదలకు రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, అత్యవసరంగా రైతుల కోసం రూ.600 కోట్లు, హైదరాబాద్‌కు రూ.750 కోట్లు అవసరమని సీఎం పత్రికా ప్రకటనలో కేంద్రాన్ని డిమాండ్‌ చేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వివరించారు. కేంద్రం తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ‘‘విపత్తుల నిర్వహణ చట్టం కింద కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.977.67 కోట్లు ఉంచింది. కేంద్ర కమిటీ నివేదిక ప్రకారం నాటి వరదలకోసం రూ.245.96 కోట్లు రాష్ట్రం వినియోగించుకోవచ్చు’’ అని తెలిపారు. అడ్వొకేట్‌ జనరల్‌ మాట్లాడుతూ... ‘‘అప్పట్లో ప్రాథమికంగా నష్టం వాటిల్లినట్లు భావించాం. కానీ నష్టం జరగలేదు. పంట దిగుబడి తగ్గి ఉండవచ్చు. విపత్తుల నిర్వహణ చట్ట పరిధిలోకి వచ్చేంత కాదు. ఈ చట్టం కింద కేంద్రం ఉంచిన నిధులను రాష్ట్రం కొవిడ్‌ వంటివాటికి వెచ్చించింది’’ అని చెప్పారు. ‘‘కేంద్ర బృందం వచ్చి రూ.188 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొంది. మీరు నష్టం వాటిల్లలేదనడం ఆశ్చర్యంగా ఉంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని