రాష్ట్రంలో కైటెక్స్‌ దుస్తుల పరిశ్రమలు

ప్రధానాంశాలు

రాష్ట్రంలో కైటెక్స్‌ దుస్తుల పరిశ్రమలు

వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో  భూములను పరిశీలించిన సంస్థ ఛైర్మన్‌ సాబు జాకబ్‌

నేడు అవగాహన ఒప్పందాలు

ఈనాడు, హైదరాబాద్‌: కేరళకు చెందిన ప్రసిద్ధ దుస్తుల తయారీ సంస్థ కైటెక్స్‌ వరంగల్‌లోని కాకతీయ మెగా జౌళి పార్కుతో పాటు రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లి పారిశ్రామిక పార్కులో పరిశ్రమలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిపై శనివారం మంత్రి కేటీ రామారావు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. నాలుగు నెలల క్రితం కైటెక్స్‌ గార్మెంట్స్‌ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ సాబు జాకబ్‌ హైదరాబాద్‌కు వచ్చి కేటీఆర్‌తో సమావేశమై, పరిశ్రమల స్థాపనకు సంసిద్ధత తెలిపారు. దీనికి అనుగుణంగా కైటెక్స్‌ రెండు పరిశ్రమల కోసం తమ ప్రతిపాదనలను సమర్పించింది. రెండుచోట్ల 150 ఎకరాల చొప్పున భూమిని, రాయితీలు, ప్రోత్సాహకాలను కోరింది. దీనిపై ఇటీవల పరిశ్రమల మంత్రివర్గ ఉపసంఘం చర్చించి ఆమోదం తెలిపింది. శుక్రవారం సాబు జాకబ్‌ బృందం హైదరాబాద్‌కు వచ్చి పరిశ్రమల శాఖ అధికారులతో భేటీ అయింది. వారికి రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్‌ను సమకూర్చగా... వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని కాకతీయ జౌళిపార్కును, రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలోని పారిశ్రామిక పార్కును, అక్కడి భూములను జాకబ్‌ సందర్శించారు. రెండుచోట్ల పరిశ్రమల స్థాపనకు తమకు అనుకూలతలు ఉన్నాయని తెలిపారు. శనివారం రెండు పరిశ్రమలపై అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని, ఆ వెంటనే కార్యాచరణ చేపడతామన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని