వేధించేందుకే నాపై కేసు

ప్రధానాంశాలు

వేధించేందుకే నాపై కేసు

ఏపీ హైకోర్టులో ఐఆర్‌టీఎస్‌ అధికారి సాంబశివరావు అత్యవసర వ్యాజ్యం

ఈనాడు, అమరావతి: ఏపీ రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఫ్‌ఎల్‌) తొలి దశ టెండర్లను గత ప్రభుత్వ హయాంలో టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు అక్రమంగా కట్టబెట్టారన్న ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిలునివ్వాలని ఐఆర్‌టీఎస్‌ అధికారి కోగంటి సాంబశివరావు కోరారు. ఈ మేరకు ఆదివారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం సోమవారం విచారించనుంది. ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌ (ఐఆర్‌టీఎస్‌) అధికారి సాంబశివరావు 2015 జనవరి28 నుంచి 2018 డిసెంబరు10 వరకు డిప్యుటేషన్‌పై ఏపీ ప్రభుత్వంలో పనిచేశారు. 2016 మార్చి4 వరకు ఏపీ మౌలిక వసతుల సంస్థ (ఇన్‌క్యాప్‌) వీసీ అండ్‌ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో తొలిదశ ఫైబర్‌నెట్‌ టెండర్లను టెరా సంస్థకు అక్రమంగా కట్టబెట్టారన్న ఆరోపణలతో సాంబశివరావును రెండో నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. శనివారం అరెస్టు చేసింది. తొలి దశ టెండర్ల బిడ్డింగ్‌ విషయంలో ఇన్‌క్యాప్‌కు చెందిన ఏ ఒక్క అధికారీ బిడ్డర్లతో కుమ్మక్కయ్యారని చెప్పడానికి వీల్లేదని,  టెండర్ల మదింపు విధానమంతా పారదర్శకమేనని సాంబశివరావు బెయిల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని