రూ.600 కోట్ల పన్ను రాయితీ చెల్లించాలి

ప్రధానాంశాలు

రూ.600 కోట్ల పన్ను రాయితీ చెల్లించాలి

ప్రభుత్వానికి పత్తి మిల్లర్లు, వ్యాపారుల సంఘం వినతి

ఈనాడు, హైదరాబాద్‌: పత్తి జిన్నింగ్‌ మిల్లులకు చెల్లించాల్సిన రూ.600 కోట్ల పన్ను రాయితీ బకాయిల విడుదలపై పరిశ్రమలు, వ్యవసాయశాఖల మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డిలు గతంలో ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదని తెలంగాణ పత్తి మిల్లర్లు, వ్యాపారుల సంఘం అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి చెప్పారు. పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేస్తే ఎందరో రైతులు లబ్ధి పొందుతారని భావించి.. జిన్నింగ్‌ మిల్లులు ఏర్పాటుచేసి నష్టాల్లో చిక్కుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం నేతలు మాట్లాడారు. ఈ మిల్లులకు 2010 నుంచి ఇప్పటివరకు రూ.600 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీ బకాయిలు రావాల్సి ఉన్నా వాటిని ప్రభుత్వం చెల్లించడంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఈ విషయమై గతంలో పలుమార్లు మంత్రులను కలసి వివరించామన్నారు. కొందరు మిల్లులను నడపలేక విద్యుత్తు కనెక్షన్లను సరెండర్‌ చేసినా జరిమానా కట్టించుకుంటున్నారని రవీందర్‌రడ్డి ఆరోపించారు. ఈ జరిమానాలు రద్దు చేస్తామని సీఎం హామీ ఇచ్చినా అమలు కాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలలో మిల్లుల విద్యుత్తు ఛార్జీల్లో యూనిట్‌కు రూ.2 చొప్పున రాయితీ ఇస్తున్నారని.., ఇక్కడా అలాగే ఇవ్వాలని విన్నవించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని