కార్యాలయాలకు సకాలంలో రారెందుకు?

ప్రధానాంశాలు

కార్యాలయాలకు సకాలంలో రారెందుకు?

తహసీల్దార్లు, ఆపరేటర్ల హాజరుపై నిఘా  

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు - మ్యుటేషన్ల స్లాట్లు ఉదయం 10.30 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా.. పలు జిల్లాల్లో కొందరు తహసీల్దార్లు తీరిగ్గా కార్యాలయాలకు హాజరవుతున్నారు. ధరణి ఆపరేటర్లు కూడా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నమోదవుతున్న స్లాట్లు, పూర్తవుతున్న రిజిస్ట్రేషన్ల సమయానికి పొంతన ఉండటం లేదు. ఏంటని అడిగితే ఇతరత్రా కారణాలు చెబుతున్నారు. ఈ విషయం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరింది. సమయపాలన పాటించి రిజిస్ట్రేషన్లు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆయన ఆదేశించినా పరిస్థితిలో మార్పు రాలేదు. చివరికి ప్రతి మండలానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య(ఐడీ)ని ఏర్పాటు చేసి నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

అసలేం జరిగిందంటే..

స్లాటు కేటాయింపునకు, రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యే సమయానికి మధ్య గంటల వ్యవధి ఉంటున్నట్లు తేలింది. నిర్దేశిత సమయానికి క్రయ, విక్రయదారులు అక్కడికి చేరుకుంటున్నా.. కొందరు తహసీల్దార్లు సకాలంలో ప్రక్రియను పూర్తి చేయడం లేదని ప్రభుత్వం గుర్తించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఉదయం 10.30 గంటలకల్లా కచ్చితంగా ధరణి పోర్టల్లో లాగిన్‌ కావాలంటూ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే, సాంకేతికతలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని కొందరు ఆఫీస్‌కు హాజరుకాకున్నా.. ఇతర డివైజ్‌ల నుంచి లాగిన్‌ అవుతున్నట్లు గుర్తించారు. ధరణి పోర్టల్‌ను పర్యవేక్షిస్తున్న ఐటీ బృందం ఈ విషయాన్ని తాజాగా సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లింది. ఆగ్రహం వ్యక్తంచేసిన ఆయన.. ఇకపై కార్యాలయం నుంచే లాగిన్‌ అయ్యేలా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రతి తహసీల్దారు, ధరణి ఆపరేటర్‌ వినియోగించే కంప్యూటర్‌లకు ప్రత్యేకంగా గుర్తింపు(ఐడీ) సంఖ్యను ఏర్పాటు చేసే ప్రక్రియలో సాంకేతిక విభాగం తలమునకలై ఉంది. సిబ్బంది తప్పనిసరిగా సకాలంలో ఆఫీస్‌కు వచ్చి అక్కడి నుంచే సేవలు అందించేలా పర్యవేక్షించాలని కలెక్టర్లనూ సీఎస్‌ మరోసారి ఆదేశించినట్లు తెలిసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని