ఇళ్ల స్థలాల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం

ప్రధానాంశాలు

ఇళ్ల స్థలాల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం

కేటీఆర్‌ అధ్యక్షతన ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఇళ్ల స్థలాల సమస్యలు, ఇతర అంశాల పరిష్కారం కోసం పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, సబితారెడ్డి ఇందులో సభ్యులుగా నియమితులయ్యారు. అనుమతి లేని లేఅవుట్లు, ప్లాట్లు-ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ, గ్రామకంఠం సహా ఇండ్ల స్థలాలకు సంబంధించిన ఇతర అంశాలను ఉపసంఘం పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసులు అందించనుంది. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉప సంఘానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

ధరణి, పోలీసు సమస్యలపై ఉపసంఘం...

మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు మరో రెండు ఉపసంఘాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులిచ్చింది. ధరణి పోర్టల్‌లో తలెత్తుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాల కోసం... హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సబితారెడ్డితో ఉపసంఘం ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల నేపథ్యంలో పోలీస్‌స్టేషన్లు, సంబంధిత అంశాలు, సమస్యలపై మహమూద్‌అలీ నేతృత్వంలో హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, సబితారెడ్డి, పువ్వాడ అజయ్‌ సభ్యులుగా మరో ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇటీవలే పోడు భూములపై కూడా మంత్రి సత్యవతి రాఠోడ్‌ అధ్యక్షతన మరో ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని