యువతకు స్ఫూర్తి.. మీలాంటి వారే

ప్రధానాంశాలు

యువతకు స్ఫూర్తి.. మీలాంటి వారే

జ్ఞానేశ్వర్‌కు ఎంపీ సంతోష్‌కుమార్‌ అభినందనలు

ఈనాడు, సంగారెడ్డి: కొట్టిపడేసిన రావి చెట్టుకు కొత్త ఊపిరులూదిన యువకుడికి ఎంపీ సంతోష్‌కుమార్‌ నుంచి అభినందనలు అందాయి. అతడి కృషిని మెచ్చుకుంటూ ట్వీట్‌ చేయడంతో పాటు ఫోన్‌లో మాట్లాడారు. మీలాంటి వారే యువతకు స్ఫూర్తి అంటూ కొనియాడారు. సంగారెడ్డి జిల్లా ముక్టాపూర్‌కి చెందిన జ్ఞానేశ్వర్‌(23) కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం తన ఊళ్లో కొట్టి పడేసిన రావిచెట్టు.. తిరిగి చిగురించేలా చొరవ తీసుకున్నాడు. ఇదే విషయాన్ని ‘కొట్టేసిన చెట్టుకు... కొత్త చిగుళ్లు తొడిగించి!’ శీర్షికన మంగళవారం ‘ఈనాడు’ కథనాన్ని అందించింది. దీనిని జతచేస్తూ ఎంపీ సంతోష్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. నేటి యువత ప్రకృతిని కాపాడేందుకు సాధ్యమైనంత కృషిచేయాలని ఆకాంక్షించారు. మధ్యాహ్నం జ్ఞానేశ్వర్‌కు ఫోన్‌ చేసి  మాట్లాడారు. ‘మీరు చేస్తున్న పని చాలా గొప్పది. మారుమూల పల్లెలో ఉండీ పర్యావరణహితం కోసం పాటుపడుతుండటం అభినందనీయం. యువత అందరూ ఇలా ఆలోచిస్తే భూతాపం నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. గ్రీన్‌ ఛాలెంజ్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లండి. ప్రతి ఒక్కరూ కనీసం మూడు మొక్కలు నాటి పరిరక్షించేలా ప్రోత్సహించండి. హైదరాబాద్‌లో కలుద్దాం’ అంటూ చెప్పారు. ఎంపీ సంతోష్‌తోపాటు పర్యావరణవేత్త పురుషోత్తంరెడ్డి, కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్త సాయిభాస్కర్‌రెడ్డి తదితరులు తన కృషిని అభినందించడం సంతోషంగా ఉందని జ్ఞానేశ్వర్‌ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని