దళితబంధు, పంట మార్పిడిపై సమగ్ర సమాచారం

ప్రధానాంశాలు

దళితబంధు, పంట మార్పిడిపై సమగ్ర సమాచారం

అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు అన్ని శాఖలు సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. శాసన సమావేశాల సన్నద్ధతపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలు శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు. దళితబంధు పథకం కార్యాచరణ నివేదికను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ఉప్పుడు బియ్యం కొనుగోళ్లకు కేంద్రం నిరాకరిస్తున్నందున పంట మార్పిడి అవకాశాలపై వివరాలివ్వాలని ఆదేశించారు. రైతు రుణమాఫీ అమలు, వ్యవసాయ దిగుబడుల సమాచారం సిద్ధం చేయాలన్నారు. కరోనా స్థితిగతులు, రాష్ట్ర ఆదాయవ్యయాలపై ప్రభావం, కొత్త మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, ఉద్యోగుల పీఆర్‌సీ, కొత్త జోనల్‌ విధానం తదితర అంశాలపైనా సమాచారమివ్వాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు, కేంద్రం కృష్ణా, గోదావరి బోర్డులపై జారీ చేసిన నోటిఫికేషన్‌ వివరాలను అందజేయాలని ఆదేశించారు. అంతకుముందు సీఎం హోంశాఖపై సమీక్ష నిర్వహించారు. సీఎస్‌, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు శాఖలో ఖాళీల భర్తీ, జోనల్‌ విధానం అమలుపై చర్చించారు. నియామకాల జాబితాను సిద్ధం చేయాలన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని