ఆర్టీసీకి మరో రూ.500 కోట్ల రుణం

ప్రధానాంశాలు

ఆర్టీసీకి మరో రూ.500 కోట్ల రుణం

 ముందుకొచ్చిన బ్యాంకులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీకి అప్పు ఇచ్చేందుకు ఎట్టకేలకు బ్యాంకులు ముందుకొచ్చాయి. రూ.500 కోట్ల రుణానికి సుముఖమని బ్యాంకులు ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాయి. రవాణా సంస్థను ఆదుకునేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.1,500 కోట్లు, బడ్జెటేతర రూపంలో మరో రూ.1,500 కోట్లను ప్రతిపాదించారు. కరోనా సమయంలో ఆదాయం పడిపోవటంతో నెలవారీగా జీతభత్యాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ వచ్చింది. బడ్జెటేతర కింద బ్యాంకుల నుంచి రూ.వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు వీలుగా మే నెలలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత రుణం ఇచ్చేందుకు బ్యాంకులు అంతగా ముందుకు రాలేదు. తర్జనభర్జనల మీదట రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చాయి. గత నాలుగు నెలల నుంచి అధికారులు రుణం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు మరో రూ.500 కోట్లు ఇచ్చేందుకు బ్యాంకులు సుముఖత వ్యక్తంచేశాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ నుంచి మరో దఫా సూత్రప్రాయ అనుమతి లభించిన వెంటనే బ్యాంకులు రుణాన్ని విడుదల చేయనున్నాయి. వారాంతంలోగా ఆర్టీసీ ఖాతాకు ఈ మొత్తం జమయ్యే అవకాశం ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని