కొత్తయాప్‌పై పంచాయతీ కార్యదర్శుల ఆందోళన

ప్రధానాంశాలు

కొత్తయాప్‌పై పంచాయతీ కార్యదర్శుల ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌ : రోజువారీ జియోలొకేషన్‌ ట్రాకింగ్‌ కోసం ఉద్దేశించిన డెయిలీ శానిటేషన్‌ రిపోర్టు (డీఎస్‌ఆర్‌) కొత్త యాప్‌ను ఉపసంహరించుకోవాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.  గురువారం జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) ఇచ్చిన మెమోపై తమ సంఘం అసంతృప్తి వ్యక్తం చేస్తుందన్నారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోని వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఉన్నతాధికారులిస్తున్న ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రతిరోజూ గ్రామాల్లో చేపట్టే రోజువారీ పనులకు సంబంధించిన ఆధారాలను సెల్ఫీతో పాటు ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రభుత్వం సూచించిందని పేర్కొన్నారు. ఈ కొత్తయాప్‌తో ఉద్యోగులు ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కడెక్కడకు వెళ్లారు? ఏం పనులు చేశారు? గ్రామంలో ఉన్న సమయం ఎంత? బయట ఎంత సేపు ఉన్నారన్న విషయమై ట్రాకింగ్‌ ఏర్పాట్లు చేశారని... ఇతర ప్రభుత్వ విభాగాల్లో లేని విధంగా.. గోప్యతను హరించేలా ఏర్పాట్లు చేశారని మండిపడ్డారు. ట్రాకింగ్‌పై యాప్‌లో వివరాలు నమోదు చేయని కార్యదర్శులపై వేటువేస్తామని డీపీవోలు హెచ్చరిస్తున్నారని, దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని