దర్యాప్తులో ఆ అయిదుగురి పాత్ర ఏంటి?

ప్రధానాంశాలు

దర్యాప్తులో ఆ అయిదుగురి పాత్ర ఏంటి?

సీపీ భగవత్‌ను విచారించిన కమిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ ఉదంతానికి సంబంధించి త్రిసభ్య కమిషన్‌ గురువారం రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ను విచారించింది. ‘దిశ’ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధిపతిగా ఉన్న మహేశ్‌ భగవత్‌ను కమిషన్‌ తరఫు న్యాయవాది పరమేశ్వర్‌ పలు ప్రశ్నలడిగారు. సిట్‌  సభ్యులు ఉదయ్‌కుమార్‌రెడ్డి, పి.శ్రీధర్‌రెడ్డి, ఎం.శ్రీధర్‌రెడ్డి, రాజశేఖర్‌రాజు, వేణుగోపాల్‌రెడ్డి దర్యాప్తులో ఎలాంటి పాత్ర పోషించారని ప్రశ్నించారు. సిట్‌ ఏర్పాటు క్రమం, దాని సమావేశ వివరాలను భగవత్‌ చెప్పే ప్రయత్నం చేయగా.. తమ ప్రశ్నకు నేరుగా సమాధానమివ్వాలని న్యాయవాది, కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ సిర్పుర్కర్‌, సభ్యురాలు జస్టిస్‌ రేఖాసుందర్‌ బల్డోటా సూచించారు. ఎం.శ్రీధర్‌రెడ్డి నిందితుల కాల్‌డేటా, సీసీ కెమెరాల సమాచారం సేకరించారని, వేణుగోపాల్‌రెడ్డి ఎన్‌కౌంటర్‌ అనంతరం ఆయుధాలను న్యాయస్థానంలో డిపాజిట్‌ చేశారని, మిగిలిన సభ్యులు ఘటనాస్థలిని సందర్శించడంతోపాటు దర్యాప్తు అధికారికి సహకరించారని మహేశ్‌ భగవత్‌ సమాధానమిచ్చారు. ఎన్‌కౌంటర్‌ సమయంలో షాద్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న శ్రీధర్‌కుమార్‌ను న్యాయవాది పరమేశ్వర్‌ రెండో రోజూ కూడా విచారించారు. ఎన్‌కౌంటర్‌ తర్వాత కేసు దర్యాప్తులో ఆలస్యమెందుకైందని ప్రశ్నించగా.. ఘటనాస్థలిలో జనాల్ని అదుపు చేసేందుకు సమయం పట్టిందని శ్రీధర్‌కుమార్‌ సమాధానమిచ్చారు. అరెస్ట్‌ చేసినప్పటి నుంచి రిమాండ్‌కు తరలించే వరకు నిందితులను ఉంచిన షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు లేవని శాంతిభద్రతల అదనపు డీజీపీ జితేందర్‌ నివేదిక ఇచ్చారని, సీసీ కెమెరాలు ఉన్నా ఆ సమయంలో పని చేయలేదని మీరెలా చెబుతారని న్యాయవాది ప్రశ్నించారు. ఠాణా సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఏమైనా సేకరించారా అన్న ప్రశ్నకు లేదు అని బదులిచ్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని