వేలిముద్ర చెబుతుంది

ప్రధానాంశాలు

వేలిముద్ర చెబుతుంది

రాష్ట్రంలో 1,76,965 మంది దోషులవి నిక్షిప్తం

ఈనాడు, హైదరాబాద్‌: నేరస్థుల వేలిముద్రల రికార్డు ప్రక్రియలో తెలంగాణ వేలిముద్రల విభాగం(ఫింగర్‌ప్రింట్‌ బ్యూరో) క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. దోషులను గుర్తించడంలో కీలకమైన ఈ ముద్రల నమోదులో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ సత్తా చాటుతోంది. 2020 చివరినాటికి ఈ విభాగం వద్ద 1,76,965 మంది వేలిముద్రలు నిక్షిప్తమై ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో నమోదు చేసిన దోషుల వేలిముద్రల్లో తెలంగాణలో నమోదు చేసినవి 7 శాతానికిపైగా ఉండటం విశేషం. దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 23,93,554గా ఉంది. తెలంగాణలో పాత నేరస్థుల వేలిముద్రల్ని నమోదు చేసేందుకు ‘పాపిలాన్‌’ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ కేసులో నిందితులను అరెస్ట్‌ చేసిన సందర్భంలో ఈ పరిజ్ఞానంతోనే వారి వేలిముద్రల్ని సేకరించి డిజిటలైజ్‌ చేస్తున్నారు. గతంలో నేరస్థుల వేలిముద్రల్ని కాగితాలపై నమోదు చేసి భద్రపరిచేవారు. సాధారణంగా అవి సంబంధిత పోలీస్‌ యూనిట్‌తో పాటు రాష్ట్ర వేలిముద్రల విభాగంలో మాత్రమే ఉండేవి. అదే నేరస్థుడు రాష్ట్రంలోని వేరే ప్రాంతంలో నేరానికి పాల్పడితే గుర్తించడం కష్టంగా ఉండేది. పాపిలాన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఆ చిక్కులు దాదాపుగా తొలిగిపోయాయి. వేలిముద్రల్ని ఎప్పటికప్పుడు డిజిటలైజ్‌ చేసి రాష్ట్రవ్యాప్తంగా అనుసంధానం చేయడంతో ఆదిలాబాద్‌లో నేరం చేసిన వ్యక్తి హైదరాబాద్‌లో అనుమానస్పదంగా దొరికినా వెంటనే పాత నేరస్థుడు అని నిర్ధారించే అవకాశముంటోంది. ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో అనుసంధానించే ‘నేషనల్‌ ఆటోమేటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌(నాఫిస్‌)’ ప్రాజెక్టు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇది పూర్తయితే దేశంలో ఎక్కడ నేరం చేసిన వారినైనా గుర్తించేందుకు మార్గం సుగమం అవుతుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని