పన్నెండు కోర్టులకు ఒకే మేజిస్ట్రేట్‌

ప్రధానాంశాలు

పన్నెండు కోర్టులకు ఒకే మేజిస్ట్రేట్‌

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా కోర్టుల భవన సముదాయంలో గత నెల రోజులుగా మొత్తం 12 కోర్టులకు ఒకే మేజిస్ట్రేట్‌ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. జిల్లా కోర్టుల్లోని పలువురు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్ల(జూనియర్‌ సివిల్‌ జడ్జీలు)కు సీనియర్‌ సివిల్‌ జడ్జీలుగా పదోన్నతి కల్పించి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నెల రోజుల క్రితం బదిలీ చేసింది. బదిలీ అయిన వారి స్థానాల్లో కొత్త వారిని నియమించలేదు. దీంతో సైబరాబాద్‌ 6వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కర్నాటి కవిత 12 కోర్టులకు ఇన్‌ఛార్జి మేజిస్ట్రేట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తను పనిచేస్తున్న 6వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌.. 6వ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులకు అదనంగా సైబరాబాద్‌ 2, 3, 4, 5, 7, 24, 28, 29, 30వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులతో పాటు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు, సైబరాబాద్‌ 2 మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు అనుబంధంగా ఉన్న బాలల న్యాయ మండలి ఛైర్మన్‌గా విధుల్లో కొనసాగుతున్నారు. 12 కోర్టుల్లో ఒకే న్యాయమూర్తి నిత్యం రిమాండ్లు, జైళ్లు, బెయిలు, వారెంట్లు తదితర రెగ్యులర్‌ ప్రొసీడింగ్స్‌ నిర్వహించడం భారమేనని న్యాయవాదులు అంటున్నారు. కరోనా ఉద్ధృతి తగ్గి క్రమంగా కోర్టుల్లో భౌతిక విచారణలు మొదలవుతున్న సమయంలో ఉన్నత న్యాయస్థానం చొరవ చూపి ఆయా కోర్టులకు మేజిస్ట్రేట్లను నియమించాలని న్యాయవాదులు అభ్యర్థిస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని