28న కృష్ణా బోర్డు ఉపసంఘం సమావేశం

ప్రధానాంశాలు

28న కృష్ణా బోర్డు ఉపసంఘం సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో పేర్కొన్న కృష్ణా ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి చేర్చేందుకు వీలుగా రాష్ట్రాలతో భేటీ అవుతున్న కృష్ణా బోర్డు ఉప సంఘం ఈనెల 28న మరోమారు సమావేశం నిర్వహించనుంది. బోర్డులో సభ్యులుగా ఉన్న రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖల సీఈలతో పాటు ఉపసంఘం సభ్యులు హాజరుకానున్నారు. ఇప్పటికే బోర్డు కోరుతున్నట్లు ప్రాజెక్టుల వివరాలు, సమాచారాన్ని రెండు రాష్ట్రాలు దాదాపు అందజేశాయి. ఇంకా ఇతరత్రా సమాచారాన్ని పూర్తిస్థాయిలో సమకూర్చడంతో పాటు ఆర్గనైజేషన్‌ స్ట్రక్చర్‌కు సంబంధించి కొంత స్పష్టత ఇవ్వాల్సి ఉంది. వచ్చేనెల 14వ తేదీ నుంచి గెజిట్‌ను అమలు చేసేందుకు వీలైనంతవరకు రాష్ట్రాల నుంచి వివరాలు తీసుకుని అందజేయాలంటూ కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఉపసంఘం చర్యలు వేగవంతం చేసినట్లు తెలిసింది. ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించి అందినంతవరకు సమాచారాన్ని త్వరగా పంపాలని సూచించినట్లు సమాచారం. మరోవైపు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోని ప్రాజెక్టుల నిర్వహణకు రెండు రాష్ట్రాలు చెరో రూ.200 కోట్ల చొప్పున డిపాజిట్‌ చేయాలని కేంద్రం గెజిట్‌లో సూచించిన విషయం తెలిసిందే. దీనికిగాను మరోమారు రెండు రాష్ట్రాలతో బోర్డులు సమావేశం నిర్వహించనున్నాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని