గిరిజనులకు హక్కులెలా కల్పిద్దాం?

ప్రధానాంశాలు

గిరిజనులకు హక్కులెలా కల్పిద్దాం?

పోడుభూములపై మంత్రివర్గ ఉపసంఘం చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పించే విషయమై ప్రభుత్వం దృష్టి సారించింది. వీటిపై గిరిజనులకు ఏ ప్రాతిపదికన హక్కులు కల్పించాలన్న అంశంపై గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన గిరిజనులకు, ఏళ్లుగా అడవుల్లో జీవనం కొనసాగిస్తున్న గిరిజనేతరుల భూములపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, అజయ్‌కుమార్‌, అధికారులు శాంతికుమారి, క్రిస్టీనా, పీసీసీఎఫ్‌ శోభ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పాల్గొని.. హక్కుల కల్పనపై సమాలోచనలు చేశారు. పోడుభూములపై గిరిజనులకు హక్కులు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రస్తావనకు వచ్చాయి. తెలంగాణలోనూ సమస్యను పరిష్కరించే అంశాన్ని ఉపసంఘం చర్చించింది. ప్రస్తుతం అటవీశాఖ పరిధిలో, ఆక్రమణదారుల చేతుల్లో ఉన్న స్థలాలు, పోడుభూమిగా గుర్తించిన విస్తీర్ణం తదితర వివరాలను సిద్ధం చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చేవారం మరోసారి సమావేశమై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉపసంఘం నిర్ణయించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని