హౌసింగ్‌ బోర్డు భూముల వేలానికి మార్గం సుగమం!

ప్రధానాంశాలు

హౌసింగ్‌ బోర్డు భూముల వేలానికి మార్గం సుగమం!

అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో హౌసింగ్‌ బోర్డు స్థిరాస్తుల వేలానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం వాటి ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను పడకుండా చట్టాన్ని సవరిస్తోంది. జూన్‌లో ఆర్డినెన్స్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయగా.. శుక్రవారం అసెంబ్లీలో తెలంగాణ గృహనిర్మాణ సంస్థ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు సొంతంగా బోర్డు, అందులో వైస్‌ఛైర్మన్‌, సభ్యులు ఉన్నారు. ఈ బోర్డు స్థానంలో ముగ్గురు సభ్యుల్ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హౌసింగ్‌ బోర్డు చట్టం-1956కి పలు సవరణలు చేయనున్నారు. దీని ప్రకారం బోర్డు నిధి రాష్ట్ర ప్రభుత్వ నిధిలో భాగంగా ఉంటుంది. తెలంగాణ గృహనిర్మాణ సంస్థ ఆస్తితోపాటుగా భూములు, ఫ్లాట్లు వంటి స్థిరాస్తుల అమ్మకాలతో వచ్చే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కానుంది. తద్వారా సర్కారుకు వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం చట్టానికి సవరణలు తీసుకొస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్‌బోర్డు ఆస్తులు విక్రయించి వచ్చిన ఆదాయం దాదాపు రూ.మూడు వేల కోట్ల మొత్తాన్ని అప్పటి ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ ఆదాయంపై 30 శాతం పన్ను కట్టాలని ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. త్వరలో హౌసింగ్‌ బోర్డుకు చెందిన భూములు, ఫ్లాట్లు అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో చట్ట సవరణ చేస్తోంది. ఏపీలో ఇప్పటికే హౌసింగ్‌ బోర్డు చట్టానికి సవరణలు చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని