దళిత బంధు సహాయ కేంద్రాల ఏర్పాటు

ప్రధానాంశాలు

దళిత బంధు సహాయ కేంద్రాల ఏర్పాటు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: దళితబంధు పథకం తీరుతెన్నులు, ఆర్థిక లావాదేవీల వివరాల్ని తెలుసుకునేందుకు కరీంనగర్‌ జిల్లాలోని పలు బ్యాంకుల్లో సహాయ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అమలు చేస్తున్న ఈ పథకం అమలును జిల్లా యంత్రాంగం సవాలుగా తీసుకుంటోంది. నియోజకవర్గ వ్యాప్తంగా 14,400 మంది ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమచేసింది. చాలామంది తమకు బ్యాంకు ఖాతాల్లో నగదు పడలేదనే ఆవేదనను వ్యక్తం చేస్తుండటంతో నియోజకవర్గంలోని అన్ని బ్యాంకుల్లో లబ్ధిదారుల సమాచారం, సందేహాల నివృత్తి కోసం ప్రత్యేకంగా సహాయ కేంద్రాలను నెలకొల్పారు.

సాయం వదులుకొని.. స్ఫూర్తిగా నిలిచి..!

దళితబంధు సాయాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అయిదుగురు స్వచ్ఛందంగా వదులుకున్నారు. తాము ఆర్థికంగా బాగానే ఉన్నామని.. అర్హులైన ఇతరులకు ఆ సాయం అందజేయాలని సూచించారు. హుజూరాబాద్‌కు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కర్రె నర్సింహస్వామితోపాటు ఆయన ఇద్దరు కుమారులు లబ్ధి తమకు వద్దంటూ తిరిగి ఇచ్చేశారు. తన సతీమణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుకాగా.. ఇద్దరు కుమారుల్లో ఒకరు రైల్వేలో సీనియర్‌ డివిజనల్‌ ఇంజినీర్‌గా, మరొకరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారని, మరింత మందికి మేలు జరగాలనే సాయాన్ని వదులుకున్నామని నర్సింహస్వామి చెబుతున్నారు. హుజూరాబాద్‌కు చెందిన విశ్రాంత పంచాయతీరాజ్‌ ఉద్యోగి సొటాల మోహన్‌రావు కూడా దళితబంధును వదులుకున్నారు. తనకు వచ్చే పింఛను చాలన్నారు. జమ్మికుంట మండలం కోరపల్లికి చెందిన యువకుడు రవీందర్‌ సైతం దళితబంధు సాయాన్ని తిరిగి ఇచ్చేశారని జిల్లా అధికారులు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని