ప్రభుత్వ ప్రాధాన్యాల ప్రకారం నిధుల చెల్లింపు

ప్రధానాంశాలు

ప్రభుత్వ ప్రాధాన్యాల ప్రకారం నిధుల చెల్లింపు

ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఆర్థికశాఖ నిధుల చెల్లింపులు కొనసాగిస్తూ... సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా చూస్తున్నామని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. పంచాయతీల్లో వైకుంఠధామాలు, ఘనవ్యర్థాల నిర్వహణ, షెడ్ల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలకు సంబంధించి ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవని పేర్కొన్నారు. ఆర్థిక సంఘం నిధులపై ఎలాంటి ఫ్రీజింగ్‌ లేదని, నిధుల విడుదల నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. శుక్రవారం ఈనాడులో ప్రచురితమైన ‘బిల్లు.. ఘొల్లు’ కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. ‘‘గ్రామాలకు నెలకు రూ.269.17 కోట్లు, పట్టణాలకు రూ.112 కోట్ల చొప్పున ఈ ఏడాదికి పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కింద 2,487 కోట్లు విడుదల చేశాం. ఇందులో ప్రస్తుతం ఈ-కుబేర్‌ వద్ద రూ.431 కోట్లు మాత్రమే చెల్లింపుల కోసం ఉన్నాయి. ఉపాధి హామీ కింద ఈ ఏడాదికి రూ.1,432 కోట్లు విడుదల చేయగా, ఇప్పటికే రూ.1002.50 కోట్లు చెల్లించాం. సీసీ రోడ్ల నిర్మాణానికి రెండేళ్లలో రూ.461కోట్లు చెల్లించగా, ప్రస్తుతం రూ.41 కోట్లు మాత్రమే చెల్లింపుల దశలో ఉన్నాయి. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలానికి రూ.2.67 లక్షల బిల్లులు చెల్లింపు క్రమంలో ఉన్నాయి. సోమవారంపేట గ్రామానికి ఐదేళ్లలో రూ.64.56 లక్షలు చెల్లించాం. ప్రస్తుతం రెండు బిల్లులు మినహా అన్నీ చెల్లిస్తున్నాం. నల్గొండ జిల్లాకు ఈ ఏడాదికి రూ.83 కోట్లు మంజూరు చేశాం. పట్టణప్రగతి కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ మినహా 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ.1,241.72 కోట్లు విడుదల చేసి, అందులో రూ.1,152.03 కోట్లు చెల్లించాం. మిగతా రూ.89.69 కోట్లు వివిధ దశల్లో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీకి పట్టణ ప్రగతిలో భాగంగా గత ఏడాది రూ.377 కోట్లు, ఈ ఏడాదికి రూ.185.87 కోట్లు ప్రభుత్వం నిధులు బదిలీ చేసింది’’ అని వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని