దృఢసంకల్పం ముంగిట మోకరిల్లిన వైకల్యం!

ప్రధానాంశాలు

దృఢసంకల్పం ముంగిట మోకరిల్లిన వైకల్యం!

రెండు చేతులూ లేకుంటే జీవితమే లేదా?.. అని ఆమె ప్రశ్నించుకుంది.. ఎందుకు లేదు?.. మనసు ఆమెను ఎదురు ప్రశ్నించింది.. అండగా ఉంటానని గుండె బదులిచ్చింది. ఆ గుండె బలం, ఆమె దృఢ సంకల్పం ముంగిట వైకల్యం మోకరిల్లింది!

చిత్రంలో కనిపిస్తున్న యువతి పేరు కొవ్వాడ స్వప్నిక.. 20 ఏళ్ల క్రితం శ్రీకాకుళం నుంచి ఆమె కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చింది. పదేళ్ల ప్రాయంలో స్వప్నిక విద్యుదాఘాతానికి గురికావటంతో ఆమె రెండు చేతులూ తొలగించాల్సి వచ్చింది. అయినా.. ఆమె కుంగిపోలేదు.. చదువును ఆపలేదు. కష్టాలకు ఎదురొడ్డింది.. డిగ్రీ పూర్తిచేసింది. చేతుల్లేకున్నా నోటి సాయంతోనే చిత్రలేఖనం నేర్చుకుంది. అంచెలంచెలుగా అందులో రాణించింది. 2013లో జాతీయ స్థాయి డ్రాయింగ్‌ పోటీల్లో మొదటి బహుమతి సాధించింది. ఆటల పైనా దృష్టిపెట్టింది. 2019లో విజయవాడలో  రాష్ట్రస్థాయి వికలాంగుల క్రీడల పోటీల్లో పరుగులో ప్రథమ, లాంగ్‌ జంప్‌లో ద్వితీయ స్థానాలు కైవసం చేసుకుంది. చిన్నాచితకా సమస్యలకే కుంగిపోయి ఆత్మహత్యాయత్నాలు చేసే యువతలో స్థైర్యం నింపటం ఆమెకు ఇష్టమైన వ్యాపకం.. అలాంటి సమావేశాలకు హాజరవుతూ ఉంటుంది. చేతులే లేని నేనే ఇన్ని సాధిస్తుంటే.. అన్నీ ఉండి మీరు చెయ్యలేనిదేముంటుంది..అంటూ వారిలో స్ఫూర్తిని రగిలిస్తుంది. ప్రస్తుతం సొంతూరులో బ్యాంగిల్‌ స్టోర్‌ నిర్వహిస్తూ తీరిక సమయాన్ని తన అభిరుచులు మెరుగుపరచుకునేందుకు వినియోగిస్తోందీ ధీశాలి.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని