100 శాతం దిశగా టీకాల పంపిణీ!

ప్రధానాంశాలు

100 శాతం దిశగా టీకాల పంపిణీ!

వైద్యఆరోగ్యశాఖ ప్రణాళిక

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే తొలిడోసు టీకా ప్రక్రియ 100 శాతం పూర్తయింది. ఇదే తరహాలో జిల్లాల్లోనూ నూరుశాతం టీకాల పంపిణీకి వైద్యఆరోగ్యశాఖ ప్రణాళిక అమలుచేస్తోంది. ముఖ్యంగా పల్లెల్లో అర్హులైన అందరికీ టీకాలు అందించాలంటే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తప్పనిసరి అని భావిస్తున్న ఆ శాఖ, గ్రామసభలు నిర్వహిస్తూ 100 శాతం టీకాల పంపిణీని అమలుచేసే విధంగా తీర్మానం చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం అన్ని జిల్లాల్లోనూ జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులకు అవగాహన కల్పించడంపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే ఇటీవల ప్రజారోగ్య సంచాలకులు జి.శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో రెండు రోజులపాటు పర్యటించారు. స్థానికంగా అవగాహన సదస్సులు నిర్వహించి, గ్రామసభ తీర్మానాల ప్రాధాన్యతను వివరించారు. ‘‘త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ పర్యటించి ఈ తరహాలో సదస్సులు నిర్వహిస్తాం. సాధ్యమైనంత త్వరగా 100 శాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని అందుకునేందుకు కృషిచేస్తాం’ అని జి.శ్రీనివాసరావు తెలిపారు. అర్హులైన అందరూ తప్పనిసరిగా టీకాలు పొందాలని, మొదటి డోసు తీసుకున్నవారు రెండోడోసు కచ్చితంగా స్వీకరించాలని ఆయన సూచించారు. ‘‘ఈ నెల మొదటి వారం వరకూ ఉన్న గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 ఏళ్లు పైబడినవారిలో సుమారు 72 శాతం మంది తొలిడోసు పొందారు. అత్యధికంగా హైదరాబాద్‌లో (110 శాతం), జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యల్పంగా 45 శాతం మందే తొలిడోసు స్వీకరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ రెండో డోసు స్వీకరించిన వారు కేవలం 38 శాతమే ఉన్నారు. అందుకే టీకాల పంపిణీని ముమ్మరం చేసేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాం’ అని ప్రజారోగ్య సంచాలకులు వెల్లడించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని