పశువుల్లోపొదుగువాపును ఇట్టే గుర్తించొచ్చు

ప్రధానాంశాలు

పశువుల్లోపొదుగువాపును ఇట్టే గుర్తించొచ్చు

‘క్వాడ్మాస్‌టెస్ట్‌’ పరికరాన్ని కనుగొన్న యువ పరిశోధకులు

చందానగర్‌, న్యూస్‌టుడే: పశువుల్లో పొదుగువాపు వ్యాధిని గుర్తించే ఓ పరికరాన్ని ఇద్దరు యువ పరిశోధక విద్యార్థులు రెండేళ్లు శ్రమించి కనుగొన్నారు. పొదుగువాపు వ్యాధి(మాస్టైటిస్‌) సోకితే ఆవులు, గేదెల పాల దిగుబడి తగ్గడమే కాకుండా కొన్ని సందర్భాల్లో అవి మృత్యువాత పడతాయి. ప్రారంభ దశలో వ్యాధి లక్షణాలు బయటికి కనిపించవు. దాంతో రైతులు సకాలంలో చికిత్స చేయించలేకపోతున్నారు. రెండోదశకు చేరినప్పుడే పాలు రంగు మారడం, జున్నులా గట్టిగా రావడం జరుగుతుంది. ఈ సమస్య పరిష్కారానికి హైదరాబాద్‌ చందానగర్‌కు చెందిన ధీకొండ కార్తీక్‌, చెన్నైకి చెందిన రాగుల్‌ పరమశివంలు తమిళనాడు వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్స్‌ యూనివర్సిటీలోని వెటర్నరీ ఇంక్యుబేషన్‌ ఫౌండేషన్‌(వీఐఎఫ్‌) ల్యాబ్‌ సహకారంతో పరిశోధన చేశారు. వ్యాధిని ఆదిలోనే గుర్తించే ‘క్వాడ్మాస్‌టెస్ట్‌’ పరికరాన్ని తయారు చేశారు. ఇందులోని 4 కప్పుల్లోకి పశువుల పొదుగు మొనలను ఉంచి 5 మి.లీ. పాలు పిండాలి. పరికరంపై ఉన్న మీటను నొక్కిన 10 సెకన్లలోనే ఎల్‌సీడీ స్క్రీన్‌పై వచ్చే ఫలితంతో వ్యాధి సోకిందా లేదా అనేది తెలిసిపోతుంది. పరికరంలో సమాన గడులు ఉండటం వల్ల పొదుగు మొనల మధ్య వ్యత్యాసాన్నీ తెలుసుకోవచ్చు. దీనికి వీఐఎఫ్‌ గుర్తింపునిచ్చింది. ఈ పరికరం గురించిన వివరాలను ‘కైమర్‌టెక్‌ ఇన్నోవేషన్స్‌ ఎల్‌ఎల్‌పీ’ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. పశువుల పెంపకందారులకు ఈ పరికరం చాలా ఉపయోగకరమని జహీరాబాద్‌ ఏరియా వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డా.ప్రభాకర్‌ తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని