గుడ్డు నాణ్యంగా ఉందా?

ప్రధానాంశాలు

గుడ్డు నాణ్యంగా ఉందా?

 అంగన్‌వాడీల్లో ఆకస్మిక తనిఖీలకు విజిలెన్స్‌ కమిటీలు

శిశు సంక్షేమశాఖ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యతలేని గుడ్లు సరఫరా అవుతున్నట్టు వస్తున్న ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో విజిలెన్సు కమిటీలను నియమించి తనిఖీ చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 35 వేలకుపైగా అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో దాదాపు 21 లక్షల మంది గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారం కోసం ఆరోగ్యలక్ష్మి కింద ప్రభుత్వం ఏటా కోట్లు ఖర్చుచేస్తోంది. లబ్ధిదారులకు పాలు, గుడ్డుతో కూడిన భోజనాన్ని అందిస్తోంది. ఆరేళ్లలోపు చిన్నారులకు నెలకు 16 గుడ్లు,  గర్భిణులకు, బాలింతలకు రోజూ ఒకటి అందిస్తోంది. ఇటీవల కాలంలో సరఫరా అవుతున్నవి నాణ్యంగా లేవంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ‘శిశు సంక్షేమశాఖ నిర్ణయించిన ప్రమాణాల మేరకు ప్రతీ గుడ్డు కనీసం 50 గ్రాములు ఉండాలి. కొన్నిచోట్ల 30 గ్రాములు కూడా ఉండటం లేదని, 10 శాతం వరకు కుళ్లిపోయి ఉంటున్నాయని’ పలు కేంద్రాల నిర్వాహకులు ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. స్పందించిన శిశు సంక్షేమశాఖ మంత్రి విజిలెన్సు కమిటీలను నియమించాలని నిర్ణయించారు. అవి ఇచ్చే నివేదిక ఆధారంగా నిబంధనలు పాటించని సరఫరాదారులపై చర్యలు తీసుకోవడమో లేదా తప్పించడమో చేస్తామని ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని