రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపుపై వివరణ ఇవ్వండి

ప్రధానాంశాలు

రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపుపై వివరణ ఇవ్వండి

ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించే వ్యవహారంపై ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి, గృహ నిర్మాణ మండళ్లతోపాటు 33 జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. జనవరి 17కు విచారణను వాయిదా వేసింది. నిర్మాణం పూర్తయిన రెండు పడకల గదుల ఇళ్లను పేదలకు కేటాయించేలా ఆదేశాలివ్వాలంటూ భాజపా నేత ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది టి.సృజన్‌కుమార్‌రెడ్డి వాదనలు వినిపించారు. 2014 నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు 2.91 లక్షల ఇళ్లు మంజూరు కాగా లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. 12,656 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారని, 1.27 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, 63 వేల ఇళ్లు నిర్మించాల్సి ఉందని తెలిపారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం రూ.8.74 వేల కోట్లు రుణాలు తీసుకుందని, కేంద్రం రూ.1311 కోట్లు మంజూరు చేసిందన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని