పెట్టుబడుల్లో తెలంగాణ మేటి

ప్రధానాంశాలు

పెట్టుబడుల్లో తెలంగాణ మేటి

ఏడేళ్లలో రూ.2.77 లక్షల కోట్ల సమీకరణ
పీఏఎఫ్‌ఐ సదస్సులో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: పెట్టుబడుల సమీకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, గత ఏడేళ్లలో రూ. 2.77 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తరలివచ్చాయని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. పారిశ్రామికవేత్తలే రాష్ట్రానికి అతిపెద్ద రాయబారులుగా, పురోగతికి సహకరిస్తున్నారని తెలిపారు. శుక్రవారం భారతీయ ప్రజావ్యవహారాల వేదిక (పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరమ్‌ ఆఫ్‌ ఇండియా) దృశ్యమాధ్యమ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ ఎదిగింది. దేశ, విదేశీ సంస్థలు ఇక్కడికి వచ్చి పెద్దఎత్తున పరిశ్రమలను స్థాపిస్తున్నాయి. వాటికి అత్యుత్తమ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నాం. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, ఔషధాలు, జీవశాస్త్రాలు, బయోటెక్‌, వైమానిక, ఆహారశుద్ధి పరిశ్రమలు, జౌళి వంటి రంగాలకు ప్రాధాన్యమిస్తున్నాం’ అని మంత్రి వివరించారు. సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ పాల్గొన్నారు.


నియోజకవర్గాల నేతలతో సమీక్ష

తెరాస ప్లీనరీ, తెలంగాణ విజయగర్జన సభల సన్నాహాల్లో భాగంగా శుక్రవారం నాలుగో రోజు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ వరంగల్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 నియోజకవర్గాల నేతలతో తెలంగాణభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ నాయకులు హాజరయ్యారు. విజయగర్జన సభ నిర్వహణలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలు కీలకపాత్ర పోషించాలని కేటీఆర్‌ సూచించారు. సభావేదిక, ఇతర ఏర్పాట్లపై చర్చించారు.


నాయినికి నివాళి  

అంతకుముందు కేటీఆర్‌ తెలంగాణభవన్‌లో రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.


 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని