రవాణా శాఖలో స్మార్ట్‌ కార్డుల కొరత

ప్రధానాంశాలు

రవాణా శాఖలో స్మార్ట్‌ కార్డుల కొరత

ఈనాడు, హైదరాబాద్‌: రవాణా శాఖను స్మార్ట్‌ కార్డుల కొరత వేధిస్తోంది. ఇదేదో ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్య కాదు. తరచుగా వస్తున్నదే. డ్రైవింగ్‌ లైసెన్సు, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(ఆర్సీ).. ఇలా పలు సేవల కోసం దరఖాస్తు చేసుకున్న వారు నెలల తరబడి కార్డుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రతి నెలా సగటున లక్షన్నర వరకు అవసరమవుతాయని అంచనా. గుత్తేదారు నుంచి వాటిని సమకూర్చుకోవటంలో అధికారులు విఫలమవుతున్నారు. పోలీసు అధికారుల తనిఖీ సమయంలో ఆర్సీ, డ్రైవింగ్‌ లైసెన్సు కార్డులు లేకపోతే జరిమానాలు విధిస్తున్నారు. ఆర్టీఏ టి వ్యాలెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో వీటిని చూపించినా అనుమతిస్తారు. కానీ ఆ వ్యాలెట్‌ను అధికారులు అంతగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు.

కార్డు కోసం రూ. 200

స్మార్ట్‌ కార్డు జారీ చేసేందుకు రవాణా శాఖ రూ.200 వసూలు చేస్తుంది. దరఖాస్తుదారులకు వాటిని చేరవేసేందుకు మరో రూ.35 కొరియర్‌ ఛార్జీ కింద తీసుకుంటోంది. ఒప్పందానికి మించి గుత్తేదారు ఇప్పటికే కార్డులు సరఫరా చేసినట్లు సమాచారం. అదనపు కార్డుల సరఫరా విషయంలో అధికారులు, గుత్తేదారు మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని సమాచారం. కొన్ని సందర్భాల్లో కార్డులు ఉన్నా ప్రింటర్‌, రిబ్బన్‌ ఇలా ఏదో ఒక సమస్యతో జారీలో జాప్యం జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని