ఆదరించి.. కల్యాణం జరిపించి..

ప్రధానాంశాలు

ఆదరించి.. కల్యాణం జరిపించి..

అనాథ యువతికి ముస్లిం దంపతుల చేయూత

బాన్సువాడ, న్యూస్‌టుడే: అనాథ బాలికను ఆదరించి విద్యాబుద్ధులు నేర్పించి.. పెళ్లి చేసి మానవత్వం చాటారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఎస్సీ బోర్లం గురుకుల పాఠశాల ప్రధాన అధ్యాపకురాలు ఇర్ఫానాబాను, హైమద్‌ దంపతులు. తాడ్వాయి గురుకుల పాఠశాలలో ఇర్ఫానా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సమయంలో... తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన లింగంపేట మండలం శెట్‌పల్లికి చెందిన చందనను ఆరో తరగతిలో చేర్పించారు. సెలవుల్లో అందరూ ఇంటికి వెళ్తుంటే ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి చందనది. ఇది గ్రహించిన ఇర్ఫానా చందనను తన ఇంటికి తీసుకెళ్లి తిరిగి పాఠశాల ప్రారంభమైనప్పుడు తీసుకువచ్చేవారు. అక్కడే పదో తరగతి వరకు చదివించారు. అనంతరం తాడ్వాయిలో ఇంటర్మీడియట్‌, బోధన్‌ ప్రైవేటు కళాశాలలో రూ.70 వేల ఖర్చుతో డీఎంఎల్‌టీ పూర్తి చేయించారు. యువతికి పెళ్లి సంబంధాలు చూడసాగారు. ఈ నేపథ్యంలో నస్రుల్లాబాద్‌ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లికి చెందిన వెంకట్రామ్‌రెడ్డి (ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌) అనాథ యువతి విషయం తెలిసి పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలోని కల్యాణ మండపంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి కుమారుడి కాళ్లు కడిగి కన్యాదానం చేశారు ఇర్ఫానా బాను-హైమద్‌ దంపతులు. మొత్తం 350 మంది అతిథులు హాజరైన వేడుకకు బోర్లం పాఠశాల సిబ్బంది రూ.75 వేలతో పెళ్లి వస్త్రాలు, సామగ్రి అందజేయగా స్థానిక వ్యాపారి సాయిబాబా గుప్తా రూ.లక్ష అందించారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని