అగ్రిక్లినిక్‌లతో ఉపాధి బాటలు!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అగ్రిక్లినిక్‌లతో ఉపాధి బాటలు!

 నిరుద్యోగులకు ఇవి వరం

ఎఫ్‌పీవోలతో రైతు వ్యాపారవేత్త అవుతారు
ప్రతిభావంతులు ఎంతోమంది వ్యవసాయంలోకి వస్తున్నారు
సేద్యంలో అనుకూల అంశాలపై చర్చించాలి
‘ఈనాడు’తో ‘మేనేజ్‌’ డైరక్టర్‌ జనరల్‌ చంద్రశేఖర

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘వ్యవసాయం అంటే మన సమాజంలో చిన్నచూపు. ఈ రంగంలో వ్యతిరేక అంశాలనే అందరూ చర్చిస్తారు. మండుటెండల్లో, మట్టిలో పనిచేయాలి, ఆదాయం రాదు, సమాజంలో గుర్తింపు ఉండదు అనే అభిప్రాయాలున్నాయి. కానీ కొద్ది కాలంగా పరిస్థితి మారుతోంది. ఎందరో ప్రతిభావంతులైన ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులు కూడా వ్యవసాయం వైపు మొగ్గుచూపుతున్నారు. పాడి పశువులతో డెయిరీల నిర్వహణకు, పంటల సాగుకు ముందుకొస్తున్నారు. కరోనా వంటి విపత్తులోనూ ధైర్యంగా తన పని తాను చేసుకుంటూ ఆదాయం పొందిన ఒకే ఒక్క వృత్తి నిపుణుడు అన్నదాత’’ అంటున్నారు జాతీయ వ్యవసాయ విస్తరణ, నిర్వహణ సంస్థ(మేనేజ్‌) డైరక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ చంద్రశేఖర. కర్ణాటకకు చెందిన ఆయన పాతికేళ్లుగా జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థల్లో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేసి ఇటీవల హైదరాబాద్‌లోని మేనేజ్‌ సంస్థ బాధ్యతలు చేపట్టారు. దేశవ్యాప్తంగా పలు వ్యవసాయ పరిశోధనా సంస్థలతో మేనేజ్‌ కలసి పనిచేస్తోంది. కేంద్ర వ్యవసాయశాఖ పరిధిలో స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్న ఈ సంస్థ దేశంలో వ్యవసాయరంగానికి ఎనలేని సేవలు అందిస్తోంది. ఈ నెల 11న మేనేజ్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, నిర్వహిస్తున్న కోర్సులు, భవిష్యత్‌ ప్రణాళికలపై ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు.

చిన్న కమతాల రైతులు పండించే పంటలపై  మంచి ఆదాయం రావాలంటే ఏం చేయాలి?
ఒక వ్యక్తి ఒంటరిగా కన్నా..సమష్టిగా అద్భుతాలు చేయగలడు. ఈ సూత్రం ఆధారంగా చిన్న కమతాల్లో పంటలు సాగుచేసే వారితో రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీఓ)లను ఏర్పాటు చేయిస్తున్నాం. మేనేజ్‌లో ఎఫ్‌పీఓ అకాడమీ పెడుతున్నాం. కంపెనీ చట్టం కింద రైతులు సంస్థను నమోదు చేసుకుంటే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఎక్కడైనా వారి పంటను నేరుగా అమ్ముకోవచ్చు. సాగుకు అవసరమైన సదుపాయాలను తక్కువ ధరకే పొందవచ్చు. దీనికి అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం మేనేజ్‌ ఇస్తుంది.

రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న కేంద్ర పథకంపై ఎలాంటి కృషి చేస్తున్నారు?

ఇజ్రాయిల్‌లో ఒక రైతు వార్షిక ఆదాయం అక్కడి ప్రభుత్వ ఉద్యోగికన్నా ఎక్కువ. మనదేశంలో రైతు కుటుంబం రోజూవారీ సగటు ఆదాయం రూ.344 మాత్రమే. ఇటీవల కొందరు ఆధునాతన పరిజ్ఞానంతో చేస్తున్న వ్యవసాయంతో నష్టభయం తగ్గింది. వ్యవసాయం లాభసాటిగా ఉందని పంటలు పండిస్తున్న ప్రతిభావంతులు చెబుతున్నారు. పంట పండించడంతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేసి సరైన మార్కెటింగ్‌ అవకాశాలు కల్పిస్తే నష్టం రాదని అనేక ఉదాహరణలు చాటుతున్నాయి. దీని వల్ల చిన్న కమతాల ఆదాయం రెట్టింపు అవుతుందని అవగాహన కల్పిస్తున్నాం.

వ్యవసాయ డిగ్రీ చేసిన వారు రైతులకు ఎంత మేరకు సాయపడుతున్నారు?

అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదు. ఎక్కువ మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. వీరితో పాటు బైపీసీ గ్రూప్‌తో డిగ్రీ పూర్తిచేసిన వారికి మేనేజ్‌ ద్వారా శిక్షణ ఇచ్చి ‘అగ్రి క్లినిక్‌’లు ఏర్పాటు చేయిస్తున్నాం. వ్యవసాయ రంగానికి అవసరమైన ఏ పనులైనా, సేవలైనా ఈ క్లినిక్‌ల ద్వారా రైతులకు అందించవచ్చు. మా దగ్గర శిక్షణ పొందిన వారిలో 32 వేల మంది అగ్రిక్లినిక్‌లు ఏర్పాటుచేసి మంచి ఆదాయం పొందుతూ ఇతరులకూ ఉపాధి కూడా కల్పిస్తున్నారు. వీరిలో వెయ్యిమందికి పైగా ఏటా రూ.కోటికి పైగా టర్నోవర్‌తో వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికన్నా ఎక్కువ ఆదాయం పొందుతున్నారు.

ప్రతిభావంతులైన విద్యార్థులు వ్యవసాయ కోర్సుల్లో చేరడానికి ముందుకు రావడం లేదు. ఎందుకు?

అవును అందరూ మెడిసిన్‌ లేదా ఇంజినీరింగ్‌కే తొలి ప్రాధాన్యమిస్తున్నారు. దేశంలో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో చేరేలా చూడాలని అన్ని వర్సిటీలు, పరిశోధనా కేంద్రాలతో మాట్లాడుతున్నాం. ఇక్కడున్న మంచి కెరీర్‌ గురించి వివరిస్తున్నాం. మేనేజ్‌లో అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ పీజీ కోర్సు ఈ ఏడాది 67 మంది పూర్తిచేస్తే అందరికీ క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఉద్యోగాలొచ్చాయి. సగటు వార్షిక వేతనం రూ.10.07 లక్షలు. వ్యవసాయ డిగ్రీలు చేసిన వారికి ఉద్యోగావకాశాలే కాకుండా, వాణిజ్యవేత్తలుగా ఎదిగేందుకు కూడా అవకాశాలున్నాయి. కానీ వీటి సమాచారం ఇప్పటి తరం పిల్లలకు తెలియడం లేదు. ఈ లోటును పూడ్చే బాధ్యత మేనేజ్‌ తీసుకుంది.

* రైతుల సమస్యలకు పరిష్కారం చూపే ఏ వినూత్న ఆలోచనతో ఎవరు ముందుకొచ్చినా వారితో అంకుర సంస్థలు మేనేజ్‌లో ఏర్పాటు చేయిస్తున్నాం. కొత్త ఆలోచనతో వచ్చిన వారికి రూ.5 లక్షల నుంచి 20 లక్షల సాయం అందిస్తున్నాం. వారికి ఆధునిక పరిజ్ఞానంపై శిక్షణనిస్తున్నాం. దీంతో వారు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. ఇప్పటివరకూ ఇలా 300 మందికి శిక్షణనిచ్చాం.


* దేశంలో ఐఐఎంలు, ఐఐటీలు, పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో మొత్తం 135 వ్యవసాయ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌(ఎంబీఏ స్థాయి) కోర్సు నిర్వహించే స్కూళ్లు ఉన్నాయి. తాజా ర్యాంకింగ్‌లో ఐఐఎం అహ్మదాబాద్‌, ఐఐఎం లక్నో తరవాత మేనేజ్‌ మూడో స్ధానంలో నిలిచింది.


* నేను వ్యవసాయ కోర్సులో చేరాలనే సంకల్పంతోనే ఇందులో చేరాను. ఇలా చేరినందుకు నేను ఎప్పుడూ అసంతృప్తి చెందలేదు. వ్యవసాయాధికారిగా చేరినా రైతులకు సేవలందిస్తున్నామనే ఆత్మసంతృప్తి ఉంటుంది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని