దేశంలో తగ్గిపోతున్న అధ్యాపకులు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశంలో తగ్గిపోతున్న అధ్యాపకులు

 ఉన్నత విద్యలోకి ఎక్కువగా ప్రవేశిస్తున్న అమ్మాయిలు
 అత్యధిక కళాశాలలున్న జిల్లాల్లో హైదరాబాద్‌ది 3వ స్థానం
 అఖిల భారత ఉన్నత విద్య సర్వే వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌, దిల్లీ: దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అధ్యాపకుల సంఖ్య తగ్గిపోతోంది. ఒకవైపు కళాశాలలు, విద్యార్థుల సంఖ్య పెరుగుతుంటే...మరో వైపు లెక్చరర్ల సంఖ్య పడిపోవడం గమనార్హం. 2015-16లో 39,071 కళాశాలలు ఉండగా 2019-20లో 42,343కు పెరిగాయి. అదే సమయంలో అధ్యాపకుల సంఖ్య 15.18 లక్షల నుంచి 15.03 లక్షలకు తగ్గిపోయింది. ఆల్‌ ఇండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌(ఏఐఎస్‌హెచ్‌ఈ) కేంద్ర విద్యాశాఖకు ఈ విషయాన్ని స్పష్టంచేసింది. ‘ఉన్నత విద్యపై అఖిల భారత సర్వే- 2019-20’ పేరుతో ఓ నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పొఖ్రియాల్‌ గురువారం విడుదల చేశారు. స్థూల నమోదు నిష్పత్తి(జీఈఆర్‌) 26.30% నుంచి 27.10 శాతానికి పెరిగినట్లు నివేదిక పేర్కొంది. అంటే 18-23 మధ్య వయసు ఉన్న ప్రతి 100 మందిలో మూడో వంతులోపు మాత్రమే ఉన్నత విద్యలోకి ప్రవేశిస్తున్నారు. అబ్బాయిల జీఈఆర్‌ 26.30 శాతం ఉండగా అమ్మాయిలది 27.30 శాతం ఉండటం గమనార్హం. అమ్మాయిలు ఉన్నత విద్యలోకి ఎక్కువగా ప్రవేశిస్తున్నారు. గత అయిదేళ్లలో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్‌ స్థాయుల్లో విద్యార్థినుల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. రాష్ట్ర జీఈఆర్‌ మాత్రం 35.60 శాతం ఉన్నా 2018-19తో పోల్చుకుంటే తగ్గింది.

సర్వేలో ముఖ్యాంశాలు...
* 2015-16తో పోల్చుకుంటే 2019-20లో 11.40 శాతం విద్యార్థుల నమోదు పెరిగింది. 18.20 శాతం అమ్మాయిల ప్రవేశాలు పెరిగాయి.
* జాతీయ ప్రాధాన్యం ఉన్న విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీ, ఐఐఎం లాంటి వాటిలో 24.70 శాతం మాత్రమే అమ్మాయిలున్నారు.
* 2014-15లో పీహెచ్‌డీ కోర్సుల్లో 1.17 లక్షల మంది ఉండగా...ఈసారి ఆ సంఖ్య 2.03 లక్షలకు చేరుకుంది. అత్యధికులు ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలోనే పరిశోధన చేస్తున్నారు. 2019లో 38,986 మంది పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు.
* యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌, ఏపీ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలో అత్యధిక కళాశాలలున్నాయి. దేశంలోని మొత్తం కళాశాలల్లో 32 శాతం 50 జిల్లాల్లోనే ఉన్నాయి.
* గ్రామీణ ప్రాంతాల్లోనే 60.56 శాతం కళాశాలలున్నాయి. 10.75 శాతం అమ్మాయిలకు ప్రత్యేకంగా ఉన్నాయి. మొత్తం కళాశాలల్లో 78.60 శాతం ప్రైవేట్‌ యాజమాన్యాల పరిధిలోనివే.
* ఉన్నత విద్యలోని మొత్తం విద్యార్థుల్లో 79.50 శాతం మంది అండర్‌ గ్రాడ్యుయేట్‌లోనే ఉన్నారు. అత్యధికంగా బీఏలో చేరుతున్నారు.
* అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలో అబ్బాయిల నమోదు 50.8%గా, అమ్మాయిల చేరిక 49.2%గా ఉంటోంది. డిప్లొమాల్లో అబ్బాయిలతో (65.1%) పోలిస్తే విద్యార్థినుల వాటా (34.9%) చాలా స్వల్పం.
* దేశంలోని విదేశీ విద్యార్థుల సంఖ్య 49,348. వారు 168 దేశాల నుంచి వస్తున్నారు.
రాష్ట్రంలో తగ్గుతున్న ఉన్నత విద్య ప్రవేశాలు
* రాష్ట్రంలో ఉన్నత విద్యలో చేరే వారి సంఖ్య తగ్గుతోంది. స్థూల ప్రవేశ నిష్పత్తి 2018-19లో 36.20 శాతం ఉండగా...ఈసారి అది 35.60 శాతానికి తగ్గింది.
* తెలంగాణలో 80 శాతం కళాశాలలు ప్రైవేట్‌ యాజమాన్యాల చేతుల్లో ఉన్నాయి. ఈ విషయంలో దేశంలో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది.
* మొత్తం 2,071 కళాశాలలు ఉండగా...ప్రతి లక్ష జనాభాకు 53 ఉన్నాయి. ఒక్కో కళాశాలలో సగటున 543 మంది విద్యార్థులున్నారు.
* 1,23,822 మంది పీజీ, 10.36 లక్షల మంది యూజీ చదువుతున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు