Covid: వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌.. భవిష్యత్‌లో ఎలా?
close

ప్రధానాంశాలు

Covid: వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌.. భవిష్యత్‌లో ఎలా?

ముందే సమాచారం అందించే ఏఐ

కాలిఫోర్నియా: కొవిడ్‌-19 వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల బారినపడే వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందన్నది తెలుసుకునేందుకు అమెరికా శాస్త్రవేత్తలు కృత్రిమ మేధస్సు (ఏఐ)ను అభివృద్ధి చేశారు. ఆసుపత్రిలో చేర్పించాల్సిన, మెకానికల్‌ వెంటిలేషన్‌ అవసరమయ్యే వారిని ముందుగానే గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. వీరిలో భారత సంతతికి చెందిన ప్రదీప్తా ఘోష్‌ కూడా ఉన్నారు.
జన్యు వ్యక్తీకరణకు సంబంధించిన టెరాబైట్ల కొద్దీ ఉన్న డేటాను ఏఐ అల్గోరిథమ్‌ సాయంతో శాస్త్రవేత్తలు శోధించారు. తద్వారా.. గతంలో వచ్చిన సార్స్‌, మెర్స్‌, స్వైన్‌ ఫ్లూ తదితర మహమ్మారుల బారినపడిన బాధితుల మధ్య ఉన్న సారూప్యతలను గుర్తించారు. 166 జన్యువులతో కూడిన ఒక సెట్‌.. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లకు మానవ రోగనిరోధక వ్యవస్థ స్పందించే తీరును వెల్లడిస్తుందని పరిశోధకులు తెలిపారు. 20 ప్రత్యేక జన్యువులతో కూడిన మరో సెట్‌.. రోగిలో వ్యాధి ఎంత తీవ్రం కావచ్చన్నది తెలియజేస్తుందన్నారు. దీనికి అనుగుణంగా రోగులకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటా సాయంతో తాజా అల్గోరిథమ్‌ను పరీక్షించారు. తద్వారా వివిధ సందర్భాల్లో జన్యు వ్యక్తీకరణ పోకడలను గుర్తించారు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు ఒకరిలో రోగ నిరోధక వ్యవస్థ స్పందించే తీరు, ఆ వ్యక్తిలో వ్యాధి ఎంత తీవ్రం కావొచ్చో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ సమయంలో రోగ నిరోధక వ్యవస్థ సైటోకైన్లు అనే ప్రొటీన్లను రక్తంలోకి విడుదల చేస్తుంది. అవి రోగనిరోధక కణాలను ఇన్‌ఫెక్షన్‌ ఉన్న ప్రదేశానికి వెళ్లేలా మార్గనిర్దేశం చేస్తాయి. కొన్నిసార్లు సైటోకైన్లు అపరిమితంగా విడుదలై, ఆరోగ్యంగా ఉన్న కణజాలంపైన దాడి చేస్తాయి. దీన్ని సైటోకైన్‌ తుపానుగా పేర్కొంటున్నారు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ బాధితుల్లో మరణాలకు ఇదే ప్రధాన కారణమవుతోంది. తాజా ఏఐ సాయంతో సైటోకైన్‌ తుపాను మూలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఊపిరితిత్తుల శ్వాసనాళాల్లోని లైనింగ్‌, తెల్లరక్త కణాలు, టి కణాల్లో ఇది వెలువడుతున్నట్లు తేల్చారు. ఈ తుపాను వల్ల శ్వాసనాళాలకు, రోగ నిరోధక వ్యవస్థలోని వైరస్‌ హంతక కణాలకు జరిగే నష్టాన్నీ వెలుగులోకి తెచ్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని