పుష్ప విలాపం..!
close

ప్రధానాంశాలు

పుష్ప విలాపం..!

ఈ రెండు ఫొటోలు చూడండి... నేను సాగుచేసిన గులాబీ తోట ఆరు నెలల క్రితం ఇలా ఉండేది (మొదటి ఫొటో).  పూలు కోసి హైదరాబాద్‌ మార్కెట్‌కు తీసుకెళితే కోత, రవాణా ఖర్చులకు కూడా సొమ్ము రావడం లేదని తోటను ఇలా నరికేశా (రెండోఫొటో). మళ్లీ నీరు పెట్టి ఎరువులు వేస్తున్నా. మరో 3, 4 నెలలకు కరోనా ప్రభావం తగ్గి పూలకు డిమాండు పెరుగుతుందని ఎదురుచూస్తున్నా. - విఠల్‌రెడ్డి, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా


ఈనాడు, హైదరాబాద్‌:  పూలతోటల రైతుల పరిస్థితి కట్టెలమ్మేవారికంటే అధ్వానంగా తయారైంది. కరోనా పరిస్థితులు ఈ వ్యాపారాన్ని బాగా దెబ్బతీశాయి. 2, 3 ఏళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు 25 నుంచి 40 శాతం దాకా ధరలు తగ్గాయి. అప్పటితో పోలిస్తే డీజిల్‌, కూలీలు, రవాణా, పురుగుమందుల రేట్లు 20 నుంచి 30 శాతం పెరిగాయి. దీనివల్ల సాగువ్యయం ఏకంగా 50 శాతం దాకా పెరిగినా.. ధరలు పడిపోవడంతో నష్టాలు వస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. తెలంగాణలో 2019-20లో 8,079 ఎకరాల్లో పూల తోటలుండగా.. 35,007 టన్నుల దిగుబడి వచ్చినట్లు ఉద్యాన శాఖ తెలిపింది. కానీ, గతేడాది(2020-21) మార్చి నుంచే కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా పూలకు డిమాండు పడిపోవడంతో రైతుల సాగు తగ్గించారు. ప్రస్తుతం 5,500 ఎకరాల్లో తోటలు సాగులో ఉన్నాయి. మరో 600 ఎకరాల్లో హరిత పందిళ్లను నిర్మించి అలంకరణకు ఉపయోగించే పూలు సాగుచేస్తున్నారు. ఈ ఏడాది పూల దిగుబడి 15 వేల టన్నులుండొచ్చని ఉద్యాన శాఖ అంచనా. రోజూ గుడిమల్కాపూర్‌ మార్కెట్‌కు ఇతర రాష్ట్రాల నుంచి రకరకాల పూలు వస్తున్నా.. ప్రస్తుతం వాటికీ పెద్దగా డిమాండ్‌ లేదు. గులాబీ, మల్లె వంటి పూలతోటల సాగు ప్రారంభించాలంటే మొదటి ఏడాది రూ.లక్ష వరకూ రైతు పెట్టుబడి పెట్టాలని ఉద్యానశాఖ అంచనా. రెండో ఏడాది కౌలుతో కలిపి రూ.60 వేల నుంచి 80 వేల దాకా సాగువ్యయమవుతుంది. కరోనాతో ధరల్లేక రైతులు నష్టపోతున్నందున సాగు విస్తీర్ణం 5500 ఎకరాలకు తగ్గించినట్లు తమ పరిశీలనలోనూ గుర్తించామని రాష్ట్ర ఉద్యానశాఖ సంచాలకుడు ఎల్‌.వెంకట్రాంరెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని