ఇంటర్‌ బోర్డులో ఇష్టారాజ్యం

ప్రధానాంశాలు

ఇంటర్‌ బోర్డులో ఇష్టారాజ్యం

 పోస్టు లేకున్నా ఏజీఎంఓగా ప్రిన్సిపాల్‌ నియామకం

అవసరం లేని చోట మరో అధ్యాపకుడికి పోస్టింగ్‌

ఇంటర్‌ విద్యాశాఖలో అధికారుల బది‘లీలలు’

అధ్యాపకులు, ప్రిన్సిపాళ్ల బదిలీల్లో ఇంటర్‌ విద్యాశాఖ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. నిబంధనలను పక్కనబెట్టి...అవసరం లేని కళాశాలల్లో పోస్టింగ్‌లను ఇచ్చుకుంటూ పోతోంది. ఎయిడెడ్‌ కళాశాలలు, వాటిలోని సెక్షన్లు మూతపడుతుండటంతో అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లను బదిలీలు చేస్తున్నారు. మరోవైపు ఏదో ఒక పని చూపి ఆన్‌డ్యూట్‌(ఓడీ)ల పేరిట ఇంటర్‌బోర్డుకు బదిలీపై తీసుకొస్తున్నారు. అవసరాన్ని పరిగణనలోకి తీసుకోకుండా... తగిన ఉత్తర్వులు లేకుండా వారికి కొత్త కళాశాలల్లో పోస్టింగ్‌లు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల జరిగిన బదిలీలు

* కామారెడ్డిలోని జీవీఎస్‌ ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాల మూతపడటంతో అక్కడున్న ప్రిన్సిపాల్‌ రంగారావును కూకట్‌పల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు పునఃనియామకం(రీ డిప్లాయిమెంట్‌) చేశారు. ఆయన్ను అకడమిక్‌ గైడెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ అధికారి(ఏజీఎంఓ)గా నియమించారు. విచిత్రమేంటంటే అక్కడ అలాంటి పోస్టు లేదు. దాంతో బాధ్యతలు చేపడదామని వస్తే ఆ పోస్టు ఇక్కడ లేదని, ఇంటర్‌ విద్యాశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు.
* సూర్యాపేటలోని రాజారాం మెమోరియల్‌ ఎయిడెడ్‌ కళాశాల భౌతికశాస్త్రం అధ్యాపకుడిని హైదరాబాద్‌ కర్మాన్‌ఘాట్‌లోని చైతన్య ఎయిడెడ్‌ కళాశాలకు బదిలీ చేశారు. వాస్తవానికి ఆ కళాశాలలో ఇప్పటికే భౌతికశాస్త్రం అధ్యాపకుడు పనిచేస్తున్నారు. పోనీ! విద్యార్థులు అధికంగా ఉన్నారా అంటే అదీ లేదు.
* హన్మకొండ వడ్డేపల్లిలోని పింగిలి జూనియర్‌ కళాశాలలో పనిచేసే అధ్యాపకురాలు తన భర్త హైదరాబాద్‌లోని ఇంటర్‌ విద్యాశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారని, తనను ఆన్‌డ్యూటీ(ఓడీ)పై హైదరాబాద్‌కు బదిలీ చేయాలని ఇంటర్‌ విద్యాశాఖకు లేఖ ద్వారా విన్నవించారు. అది అందిన మూడు రోజుల్లోనే ఆన్‌ డ్యూటీపై బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. విచిత్రమేంటంటే కళాశాల ప్రిన్సిపాల్‌ లేదా హన్మకొండ జిల్లా(అర్బన్‌) డీఐఈవో లేదా ఆర్‌జేడీ నుంచి నివేదిక అడగకుండానే మలక్‌పేటకు బదిలీ చేయడం గమనార్హం. కనీసం బదిలీ చేసిన సమాచారం కూడా వరంగల్‌ ఆర్‌జేడీకి ఇవ్వలేదని తెలిసింది. పలువురు అధ్యాపకులు ఇదేవిధంగా విన్నవిస్తే నివేదికలు అడిగారు. అయినా బదిలీలు లేవు. పలుకుబడి ఉన్నవారికి, అయిన వారికి చకాచకా ఎక్కడ కోరుకుంటే అక్కడికి ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
* ఆన్‌ డ్యూటీ(ఓడీ) పేర జిల్లాల్లో కళాశాలల ప్రిన్సిపాళ్లుగా పనిచేసే ముగ్గురిని మార్చి పరీక్షల ఫలితాలు, కళాశాలలకు అనుబంధ గుర్తింపు మంజూరు పని పేరిట ఇంటర్‌బోర్డుకు బదిలీ చేశారు. ఆ కళాశాలల్లో సీనియర్‌ అధ్యాపకులకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. బోర్డులో తగినంత మంది సిబ్బంది ఉన్నా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల నుంచి హైదరాబాద్‌కు రప్పించడంపై ఆరోపణలు వస్తున్నాయి. వారిని తీసుకొచ్చినా అనుబంధ గుర్తింపు ప్రక్రియా పూర్తికాకపోవడం గమనార్హం.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని