కేశసంపద కోల్పోతున్న కొవిడ్‌ బాధితులు

ప్రధానాంశాలు

కేశసంపద కోల్పోతున్న కొవిడ్‌ బాధితులు

దిల్లీ: కొవిడ్‌-19 బాధితుల్లో తల వెంట్రుకలు రాలిపోతున్న సమస్య ఎక్కువగా కనిపిస్తోందని, ఈ విషయమై తమ దగ్గరకు వచ్చే బాధితుల సంఖ్య 100% మేర పెరిగిందని దిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి వైద్యులు గురువారం తెలిపారు. జుత్తు ఊడిపోతున్న సమస్యతో తమ దగ్గరకు వారానికి నలుగురు లేక ఐదుగురు వస్తారని ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు. ఈ ఏడాది మే రెండో వారం నుంచి బాధితుల సంఖ్య రెట్టింపు అయిందని చెప్పారు. సాధారణంగా కొవిడ్‌-19 బాధితులు ఆ వ్యాధి నుంచి కోలుకున్న నెల తర్వాత తల వెంట్రుకలు ఊడిపోయే సమస్యతో బాధపడతారు. కొందరిలో మాత్రం కరోనాతో పోరాడుతున్నప్పుడే ఈ సమస్య కనిపించిందని వైద్యులు చెప్పారు. కరోనా సోకిన అనంతరం ఆహారపు అలవాట్లలో మార్పు కారణంగా తలెత్తిన లోపాలు, ఒత్తిడి, ఆత్రుత, ఉన్నట్టుండి హార్మోన్లలో మార్పులు, వైరస్‌ నుంచి బయటపడిన తర్వాత తలెత్తే ప్రతిచర్యల కారణంగా తాత్కాలికంగా తల వెంట్రుకలు రాలిపోయే సమస్యకు ప్రధాన కారణాలు అని చెప్పారు. ఈ మేరకు ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి కాస్మెటాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ విభాగానికి చెందిన సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ కుల్దీప్‌సింగ్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత జుత్తు ఊడిపోవడం అనేది తాత్కాలికమేనని స్పష్టంచేశారు. టీలిజన్‌ ఎఫ్లూజియమ్‌ కారణంగా ఈ సమస్య సంభవిస్తుందని తెలిపారు. కొవిడ్‌-19 సమయంలో జ్వరం, ఇతర లక్షణాలను ఎదుర్కొన్న తర్వాత శరీరం స్పందించే తీరు వల్లే ఈ సమస్య ఉత్పన్నం అవుతుందన్నారు. ఓ వ్యక్తి సాధారణంగా రోజుకు 100 వరకు వెంట్రుకలను కోల్పోతారని, టీలిజన్‌ ఎఫ్లూజియమ్‌ కారణంగా ఇది 300-400 వెంట్రుకల వరకు పెరుగుతుందని చెప్పారు. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే.. కొవిడ్‌-19 నుంచి కోలుకున్న తర్వాత పౌష్టికాహారం తీసుకోవాలని, విటమిన్లు, ఐరన్‌ వంటివి పుష్కలంగా లభించే పదార్థాలు ఆహారంలో ఉండేలా జాగ్రత్త పడాలన్నారు. ఐదు నుంచి ఆరు వారాల పాటు సమతుల ఆహారం తీసుకున్నా.. వెంట్రుకలు రాలిపోతుంటే అప్పుడు వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని