మహిళల పోషకాలకు లాక్‌డౌన్‌!

ప్రధానాంశాలు

మహిళల పోషకాలకు లాక్‌డౌన్‌!

కొవిడ్‌ ఆంక్షలతో అతివలపై పెను ప్రభావం

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 కట్టడికి గత ఏడాది విధించిన లాక్‌డౌన్‌ వల్ల భారత్‌లో మహిళల పోషకాహారంపై పెను ప్రభావం పడిందని ఓ అధ్యయనం తేల్చింది. తిండిపై కుటుంబాలు పెట్టే వ్యయం తగ్గిందని, మహిళల ఆహారంలో వైవిధ్యం కొరవడిందని పేర్కొంది. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థల్లో అవరోధాలూ ఇందుకు కారణమయ్యాయని తెలిపింది. దేశంలో ఆర్థికంగా వెనుకబడిన నాలుగు జిల్లాల్లో అధ్యయనం చేసిన టాటా-కార్నెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ న్యూట్రిషన్‌ సంస్థ ఈ మేరకు తేల్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌, బిహార్‌లోని ముంగేర్‌, ఒడిశాలోని కంధమాల్‌, కలహండి జిల్లాల్లో ఈ అధ్యయనం సాగింది. అక్కడ తిండిపై పెట్టే వ్యయం, ఆహారంలో వైవిధ్యం, పోషకాహారానికి సంబంధించిన ఇతర సూచికలను విశ్లేషించారు.

* ఆహార ఉత్పత్తుల సరఫరాను లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి మినహాయించినప్పటికీ రవాణా వ్యవస్థల్లో అవరోధాలు ఏర్పడ్డాయి. ఫలితంగా కొన్ని ఉత్పత్తుల ధరలు పెరిగాయి. వాటి లభ్యత తగ్గింది. ఇది మహిళల పోషకాహారంపై ప్రభావం చూపింది.

* 2019తో పోలిస్తే గత ఏడాది మహిళల ఆహారంలో వైవిధ్యం తగ్గింది. సూక్ష్మ పోషకాలు పుష్కలంగా కలిగి ఉన్న, మంచి ఆరోగ్యానికి, ఎదుగుదలకు దోహదపడే మాంసం, చేపలు, గుడ్లు, కూరగాయలు, పండ్లు తదితరాల వినియోగం తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం. వీటిపై కుటుంబాలు పెట్టే వ్యయం తగ్గింది. మహమ్మారికి ముందు కూడా మహిళల ఆహారంలో భిన్నత్వం లోపించింది. కొవిడ్‌-19తో ఈ పరిస్థితి తీవ్రమైంది.

* సర్వే చేసిన కుటుంబాలకు ప్రత్యేక ప్రజా పంపిణీ వ్యవస్థ (80 శాతం మందికి), నగదు బదిలీ (50 శాతం మందికి), అంగన్‌వాడీలకు ప్రత్యేక రేషన్‌ (దాదాపు 30 శాతం మందికి) ద్వారా ప్రయోజనాలు అందినప్పటికీ మహిళల విషయంలో ఈ పరిస్థితి నెలకొంది.

* సర్వేలో పాల్గొన్నవారిలో 90 శాతం మంది తాము ఆహారం తక్కువగా తీసుకున్నామని చెప్పగా.. 95 శాతం మంది మాత్రం తమ ఆహారంలో వైవిధ్యం తగ్గిందని తెలిపారు.

* లాక్‌డౌన్‌ కాలంలో అంగన్‌వాడీ కేంద్రాలను మూసేయడం.. మహిళలకు పెను ఇబ్బందికరంగా మారింది. రేషన్‌ ఇవ్వడం, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు వండిన ఆహారాన్ని అందించే ఈ కేంద్రాలు దేశంలో మహిళలు, పిల్లలకు ప్రధాన పోషకాహార వనరుగా నిలిచాయి. మహమ్మారి కాలంలో అర్హులైన కుటుంబాల్లో 72 శాతం కుటుంబాలు అంగన్‌వాడీ సేవలను పొందలేకపోయాయి.

* ఎ-విటమిన్‌ పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకునే మహిళల సంఖ్య 42 శాతం తగ్గింది. కుటుంబంలోని ఇతర సభ్యులతో పోలిస్తే భారతీయ మహిళల ఆహారంలో వైవిధ్యం తక్కువగా ఉంటోంది. కుటుంబంలో అందరూ తిన్నాకే అతివలు భోజనం చేయడం వంటి ఆనవాయితీలూ ప్రభావం చూపుతున్నాయి.

* ఆహార ధాన్యాలపైనే ఎక్కువ దృష్టి పెట్టే పథకాలు, ఆర్థిక సంక్షోభాలు, విభిన్న పోషకాలతో కూడిన ఆహార లభ్యతలో ఇబ్బందులు వంటి వాటివల్ల మహిళలకే ఎక్కువ నష్టం వాటిల్లుతున్నట్లు స్పష్టమవుతోంది. 

* ప్రజా పంపిణీ వ్యవస్థలో వైవిధ్యం ఉండేలా విధానపరమైన సంస్కరణలు తీసుకురావాలి. పోషకాలు పుష్కలంగా ఉన్న ఇతర ఆహార పదార్థాలనూ ఈ పథకంలో చేర్చాలి. సరఫరా సంబంధ ఇబ్బందులను తొలగించడానికి మార్కెట్‌ సంస్కరణలు తీసుకురావాలి. నగదు బదిలీ పథకాన్ని ఆరోగ్యకర ఆహార లభ్యతకూ విస్తరించాలి.

* మహమ్మారి వల్ల పోషకాహారంపై పడిన ప్రభావాన్ని సరిచేయడానికి తెచ్చే ఎలాంటి పథకాలైనా.. స్త్రీ/పురుష కోణంలో చూడాలి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని