ఆరు పదుల ‘ఉషో’దయం! - 67 years old vadodara woman fulfills her decades old dream
close
Updated : 23/06/2021 19:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరు పదుల ‘ఉషో’దయం!

Image for Representation

ఉన్నత చదువులు అభ్యసించి డాక్టర్‌ కావాలన్నది ఆమె చిన్ననాటి కల. కానీ పెళ్లి, ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు భుజాన పడడంతో ఆ కల కొన్ని దశాబ్దాల పాటు కలగానే మిగిలిపోయింది. అయితే చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదంటూ ఆరుపదుల వయసులో మళ్లీ పుస్తకాలు పట్టుకుంది. డిగ్రీ, పీజీ పూర్తిచేసింది. తాజాగా పీహెచ్‌డీ పట్టా కూడా అందుకుంది. ఈక్రమంలో డాక్టర్‌ కావాలన్న స్వప్నం సాకారం కాకపోయినా.. తన పేరు ముందు దర్జాగా డాక్టర్‌ హోదాను చేర్చుకుంది.

పెళ్లితో బ్రేక్‌ పడింది!

ఆసక్తి, అభిరుచి ఉంటే ఏ పనిచేయడానికైనా వయసుతో నిమిత్తం లేదని ఇప్పటికే చాలామంది మహిళలు నిరూపించారు. చదువు విషయానికొస్తే.. కొందరు మహిళలు తమ పిల్లలతో కలిసి ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. మరికొందరు వృద్ధాప్యంలో తమ మనవళ్లు, మనవరాళ్లతో కలిసి డిగ్రీ, పీజీ పట్టాలు అందుకుంటున్నారు. సరిగ్గా ఇదే కోవకు చెందుతారు గుజరాత్‌లోని వదోదరకు చెందిన ఉషా లోదయ. కుటుంబ పరిస్థితుల రీత్యా 20 ఏళ్లకే పెళ్లి చేసుకుని డిగ్రీ చదువుని మధ్యలోనే వదిలేసిందామె. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లిగా మారి వారి బాధ్యతలను భుజాలకెత్తుకుంది. అయినా తన మనసులో ఏదో మూలన చదువుకోవాలన్న తపన మాత్రం అలాగే ఉండిపోయింది. అది తాజాగా తన పిల్లల ప్రోత్సాహంతో తీరిపోయిందంటున్నారామె.

Photo: Facebook/100005259648494

చిన్ననాటి స్వప్నం సాకారమైంది!

20 ఏళ్ల వయసులో చదువు ఆపేసిన ఉష.. 9 ఏళ్ల క్రితం మళ్లీ పుస్తకాలు పట్టుకున్నారు. మహారాష్ట్ర జలగావ్‌లోని ‘శత్రుంజయ అకాడమీ’ నుంచి జైనిజంలో డిగ్రీ పూర్తిచేశారు. అందులోనే రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ పట్టా కూడా అందుకున్నారు. నాలుగేళ్ల క్రితం డాక్టరేట్‌ కోర్సు కోసం ఎన్‌రోల్‌ చేసుకున్నారు. ముంబయి ప్రొఫెసర్‌ డాక్టర్‌ జయదర్శితా శ్రీజీ మహరాజ్‌ పర్యవేక్షణలో జైన మతంలోని ఆధ్యాత్మిక చింతనలపై పరిశోధన చేశారు. రీసెర్చి మధ్యలో భర్త అకాల మరణం, లాక్‌డౌన్‌ ఇబ్బంది పెట్టినా కోర్సుకు సంబంధించిన థీసిస్‌ను సకాలంలో సమర్పించారు ఉష. తాజాగా వైవాలో కూడా ఉత్తీర్ణత సాధించి డాక్టరేట్‌ పట్టా అందుకున్నారు.

ఐదు దశాబ్దాల తర్వాత..!

‘ఏడో తరగతి చదువుతున్నప్పుడే ఎలాగైనా డాక్టర్‌ అవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. కానీ 16 ఏళ్లకే కాబోయే భర్తతో నిశ్చితార్థం జరిగింది. అయినా  ముంబయిలోని ఓ కాలేజీలో బీఎస్సీ అడ్మిషన్‌ పొందాను. అయితే 20 ఏళ్లు వచ్చేసరికి నా మెడలో మూడుముళ్లు పడ్డాయి. దీంతో డిగ్రీ మధ్యలోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. వివాహమయ్యాక మావారితో కలిసి ముంబయి నుంచి వదోదర వచ్చేశాను. ఆ తర్వాత పిల్లలు, కుటుంబ బాధ్యతలతో పూర్తి బిజీగా మారిపోయాను. కానీ నా చదువు కొనసాగించి ఉంటే బాగుండేది అన్న భావన అప్పుడప్పుడు మదిలో మెదిలేది. సుమారు ఐదు దశాబ్దాలు ఇలాగే గడిచిపోయాయి. ఈలోపు నా ఇద్దరు పిల్లలు కూడా పెరిగి పెద్దవారయ్యారు. వారి పనులు వారే చేసుకునే స్థాయికి ఎదిగారు. దీంతో నాకంటూ కొద్దిగా సమయం దొరికింది. అప్పుడే ఆగిపోయిన నా చదువును మళ్లీ పట్టాలెక్కించాలనుకున్నాను.  మావారు, పిల్లలు కూడా నా నిర్ణయాన్ని స్వాగతించారు. అలా తొమ్మిదేళ్ల క్రితం డిగ్రీ కోర్సులో చేరాను. ఆతర్వాత మాస్టర్స్‌, తాజాగా పీహెచ్‌డీ పూర్తి చేశాను’.

నా పిల్లల సహకారంతో!

‘మెడికల్‌ డిగ్రీ సంపాదించి డాక్టర్‌ అవ్వాలన్న నా కోరిక నెరవేరలేదు.. కానీ నా పేరు ముందు డాక్టర్‌ అనే పదం వచ్చి చేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా కలను సాకారం చేసుకునేందుకు ఐదు దశాబ్దాలు పట్టింది. డాక్టరేట్‌ పట్టా పొందడంలో నా కొడుకు, కూతురు ఎంతో సహకరించారు. ఇక నా పీహెచ్‌డీ కోర్సు దాదాపు ఆన్‌లైన్‌లోనే సాగింది. సమాచారం కోసం అప్పుడప్పుడు అకాడమీకి వెళ్లేదాన్ని. రీసెర్చి మధ్యలో మా వారి అకాల మరణం నన్ను కుంగదీసింది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ కూడా బాగా ఇబ్బంది పెట్టింది. అయితే నా పరిశోధనకు కావాల్సినంత సమయం దొరికింది. ఇక నా భవిష్యత్‌ ప్రణాళిల విషయానికొస్తే.. నాకు టీచింగ్‌పై ఆసక్తి ఉంది. జైనమతంలో నాకున్న పరిజ్ఞానాన్ని విద్యార్థులకు పంచాలనుకుంటున్నాను’ అని అంటున్నారు ఉష. ‘రిటైర్మెంట్‌ తీసుకోవాల్సిన వయసులో అమ్మ తన కలను నిజం చేసుకుంది. ఆమెను చూస్తుంటే మాకెంతో గర్వంగా అనిపిస్తోంది’ అంటున్నారు ఉష పిల్లలు.


మరిన్ని

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని