Hindustani Way: అనన్య పాటకు కోటి వీక్షకులు - Hindustani way song crossed 1 crore views
close
Updated : 24/07/2021 09:32 IST

Hindustani Way: అనన్య పాటకు కోటి వీక్షకులు

టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్న భారతదేశ క్రీడాకారుల వెనుక దేశప్రజలంతా ఉన్నారంటూ ‘ఛీర్‌ 4 ఇండియా’ పేరుతో ఇటీవల విడుదలైన పాటను సామాజిక మాధ్యమాల్లో కోటి మందికిపైగా వీక్షించారు. ఈ పాటను రాసి, స్వరాన్ని అందించింది ప్రముఖ వ్యాపారవేత్త కుమారమంగళం బిర్లా ముద్దుల తనయ 27 ఏళ్ల అనన్యబిర్లా. ఈ పాటకు స్వరకల్పన ఏఆర్‌ రహ్మాన్‌.

ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మన క్రీడాకారులకు కోట్లమంది అభిమానులున్నారు. ఇంతమంది ప్రేమను వ్యక్తీకరించడానికి రూపొందించిందే ఈ పాట అంటోంది అనన్యబిర్లా. ‘చాలా దేశాలు ఇలా పాటలను రూపొందించుకున్నాయి. మన ఒలింపిక్‌లో జట్టులో స్ఫూర్తి నింపేందుకు ఏదైనా చేయాలనిపించింది. కొవిడ్‌ వల్ల ఈ క్రీడలు ఆలస్యంగా మొదలుకావడం, మన క్రీడాకారులూ ఎన్నో ఇబ్బందులు, భయాందోళనల మధ్య పోటీలకు సిద్ధం కావడం పెద్ద ఛాలెంజ్‌. ఎంతో క్రమశిక్షణ, త్యాగం, లక్ష్యం ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. ఇదే వారు సాధించిన పెద్ద విజయం. వారందరికీ ప్రేరణ కల్పించే దిశగా ఓ పాట చేయాలనిపించింది. అనుకున్న వెంటనే గుర్తొచ్చిన వ్యక్తి ఏఆర్‌ రెహ్మాన్‌. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖతోనూ చర్చించాం. ఏఆర్‌ రెహ్మాన్‌కు 15 నుంచి 20 నోట్స్‌ పంపిస్తే, అందులోంచి కొన్ని ఎంపిక చేశారు. క్రీడా శాఖ ఈ పాట కోసం కొన్ని విజువల్స్‌ పంపింది. 1996లో అట్లాంటా నుంచి 2016 రియో ఒలంపిక్స్‌ వరకు అయిదు క్రీడల్లో మన దేశ విజేతల వీడియోలను పాటలో పొందుపరిచాం.

మేరీ కోం, పీవీ సింధూ, సాక్షిమాలిక్‌ వంటి వారందరూ ఇందులో కనిపిస్తారు. క్రీడాకారులను మన వాళ్లు ఎంతగా అభిమానిస్తారు, ప్రోత్సహిస్తారు అన్నవి ప్రతిబింబించేలా చేయాలనుకున్నాం. ముంబయి, దుబాయిల్లో ఏఆర్‌రహ్మాన్‌తో కలిసి పనిచేశా. కంపోజింగ్‌కు నాలుగు నెలలు పట్టింది. తర్వాత వీడియోను చిత్రీకరించాం. రహ్మాన్‌ గొప్ప గురువు. ఎన్ని ప్రశ్నలు వేసినా ఓపిగ్గా సమాధానాలు చెప్పేవారు. ఆయన నా భయాలను దూరం చేశారు. నా సృజనాత్మకతను ప్రోత్సహించారు. పాటంతా పూర్తయిన తర్వాత ఆయన ఆరు నిమిషాల ట్రాక్‌ను పంపారు. దాన్ని రెండు నిమిషాల 58 సెకన్లకు కుదించాం. ఏదైనా ఆల్బం చేసినప్పుడు నేనేమీ పెద్దగా అంచనాలు వేసుకోను. ‘ఛీర్‌4ఇండియా’ పాటకు లభిస్తున్న ఈ ఆదరణ క్రీడాకారులకు, కళాకారులకు దేశం ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా’ అని సంతోషాన్ని పంచుకుంది అనన్యాబిర్లా. వేల కోట్లకి వారసురాలైనా, తన స్వయంకృషితో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి అనుకున్నది సాధిస్తోంది ఈ అమ్మాయి. వాళ్ల అమ్మ నీరజా బిర్లాతో కలిసి కరోనా కల్లోల సమయంలో ‘ఎంపవర్‌’ అనే సంస్థను స్థాపించింది. దీని ద్వారా మూడు భాషల్లో మానసికారోగ్య సమస్యలకు ఉచితంగా కౌన్సిలింగ్‌ అందిస్తోంది. ఈ దిశగా వందల సంఖ్యలో వర్క్‌షాపులు నిర్వహించింది. అందరికీ ప్రేమ, దయను పంచడమే తన లక్ష్యం అంటోంది.

అనన్య మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని